ఎట్టకేలకు గెలిచారు..

29 Mar, 2018 14:04 IST|Sakshi

ముంబై: ఇప్పటికే ముక్కోణపు టీ 20 సిరీస్‌లో హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదుర్కొని ఫైనల్‌కు చేరడంలో విఫలమైన భారత మహిళా క్రికెట్‌ జట్టు ఎట్టకేలకు విజయం దక్కింది. గురువారం ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన నామమాత్రపు చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళలు 8 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 108 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి భారత జట్టు విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్‌ మిథాలీ రాజ్‌(6) మరోసారి నిరాశపరిచినా, స్మృతీ మంధాన(62 నాటౌట్‌; 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించి విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆమెకు జతగా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(20 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడారు.

అంతకుముందు టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మహిళా జట్టు 18.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. డానియల్లీ వ్యాట్‌(31) మాత‍్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, జోన్స్‌(15), బీమౌంట్‌(10), నటాల్లీ స్కీవర్‌(15), హీథర్‌ నైట్‌(11)లు నిరాశపరిచారు. ఐదుగురు ఇంగ్లండ్‌ మహిళా క్రీడాకారిణులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత మహిళా బౌలర్లలో అనుజా పటిల్‌ మూడు వికెట్లు సాధించగా, రాధా యాదవ్‌, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌ ఇప్పటికే ఫైనల్‌కు చేరిన తరుణంలో తాజా ఓటమి ఆ జట్టుపై ఎటువంటి ప్రభావం చూపలేదు. శనివారం ఆసీస్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య టైటిల్‌ పోరు జరుగనుంది.

మరిన్ని వార్తలు