సెంచరీతో అదరగొట్టాడు..

27 Sep, 2019 15:56 IST|Sakshi
మార్కరమ్‌(ఫైల్‌ఫొటో)

విజయనగరం: బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో ఇక్కడ డాక్టర్‌ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ మార్కరమ్‌ సెంచరీతో అదరగొట్టాడు. అత్యంత నిలకడగా ఆడి శతకంతో మెరిశాడు. 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో మార్కరమ్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా రద్దు కాగా, రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సఫారీ బ్యాటింగ్‌ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్‌ను మార్కరమ్‌-డీన్‌ ఎల్గర్‌లు ఆరంభించారు. కాగా, ఎల్గర్‌(6) ఆదిలోనే పెవిలియన్‌ చేరాడు. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఎల్గర్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

దాంతో దక్షిణాఫ్రికా 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు డీ బ్రన్‌(6) సైతం వెనుదిరగడంతో బోర్డు ప్రెసిడెంట్స్‌కు పట్టుదొరికినట్లు కనబడింది. అయితే మార్కరమ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.  హమ్జా(22)తో కలిసి మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం, బావుమాతో కలిసి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే మార్కరమ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకంతో మెరిసిన తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 48 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు