రికార్డ్ రన్స్ చేసి.. ప్రేమలోనూ నెగ్గిన క్రికెటర్

28 Feb, 2018 11:43 IST|Sakshi
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో క్రికెటర్ మయాంక్‌ అగర్వాల్‌

సాక్షి, న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో, టి20 టోర్నీ ముస్తాక్‌ అలీలో టైటిల్ పోరులో చతికిలపడ్డ కర్ణాటక జట్టు వన్డే ఫార్మాట్‌ విజయ్‌ హజారే ట్రోఫీని సొంతం చేసుకుంది. మంగళవారం సౌరాష్ట్రతో ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 41 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (79 బంతుల్లో 90; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు టైటిల్ అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు. విజయ్‌ హజారే ట్రోఫీ నెగ్గి సీజన్‌కు అద్భుత ముగింపు ఇవ్వడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ తాను విజయం సాధించినట్లు మయాంక్ అంటున్నాడు.

‘ఈ సీజన్ నాకెంతో కలిసొచ్చింది. నా ప్రియురాలికి ప్రేమ విషయం చెప్పి, లవ్ ప్రపోజ్ చేయగా.. అందుకు ఆమె ఒప్పుకుంది. మరోవైపు విజయ్ హజారే ఓ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెరీర్ పరంగా రాణించినందుకు సంతోషంగా ఉంది. ఫైనల్ ఇన్నింగ్స్‌కుగానూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సొంతం చేసుకున్నానని’ పలు విషయాలు మయాంక్ షేర్ చేసుకున్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రేయసి వివరాలు లాంటివి మాత్రం క్రికెటర్ వెల్లడించలేదని తెలుస్తోంది.

మయాంక్‌ పరుగుల రికార్డు
విజయ్‌ హజారే ట్రోఫీ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ రికార్డు సృష్టించాడు. అతను 8 మ్యాచ్‌ల్లో 723 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు 607 పరుగులతో (2016–17) దినేశ్‌ కార్తీక్‌ పేరిట ఉండేది. దేశవాళీ క్రికెట్‌ ఒకే సీజన్‌లో అన్ని ఫార్మాట్‌లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గానూ మయాంక్‌ (2,141 పరుగులు) గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ముంబై క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1,947 పరుగులు; 2015–16) పేరిట ఉండేది.

మరిన్ని వార్తలు