పిచ్‌ను ప్రేమించి... పరుగుల వరద పారించి...

4 Oct, 2019 02:41 IST|Sakshi

వైఫల్యాల బాట వీడి సక్సెస్‌ రుచి చూసిన మయాంక్‌ అగర్వాల్‌

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 2017–18 రంజీ సీజన్‌... హైదరాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ మయాంక్‌ డకౌట్‌... తొలి మ్యాచ్‌లోనూ విఫలం కాగా, అంతకుముందు సీజన్‌లోనే 13 ఇన్నింగ్స్‌లలో 284 పరుగులతో పేలవ ప్రదర్శన కనబర్చడం ఇంకా వెంటాడుతూనే ఉంది. అలాంటి స్థితిలో మొదటి మ్యాచ్‌లో రెండు డకౌట్లు! మయాంక్‌లో ఆందోళన పెరిగిపోయింది. దాంతో మరో మార్గం లేక అతను దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ను ఆశ్రయించాడు. సాంకేతిక అంశాలకంటే కూడా ద్రవిడ్‌ మానసిక బలం గురించి హితోపదేశం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నువ్వు పిచ్‌ను ప్రేమించు, అది నీ మాట వింటుంది’ అని ద్రవిడ్‌ సూచించాడు. అంతే... ఆ తర్వాత మయాంక్‌ ఆటతీరు మారిపోయింది.

మహా రాష్ట్రతో జరిగిన పోరులో ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ నమోదు చేశాడు. తర్వాతి ఏడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 176, 23, 90, 133, 173, 134, 78... ఇలా పరుగుల వరద పారింది. సీజన్‌లో 1160 పరుగులతో టాపర్‌గా నిలిచాడు. అంతటితో ఆగకుండా వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో కూడా 8 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు సహా ఏకంగా 723 పరుగులు బాది ఎవరికీ అంద నంత ఎత్తులో నిలిచాడు. ముస్తాక్‌ అలీ ట్రోఫీ లో కూడా మూడు అర్ధసెంచరీలతో జోరు కొనసాగించడంతో మూడు ఫార్మాట్‌లలో కలిపి ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు (2141) సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు అతని ఖాతాలో చేరింది. భారత జట్టులోకి తప్పనిసరిగా ఎంపిక చేయాల్సిన పరిస్థితిని సృష్టించింది.

ఇంతింతై...
అండర్‌–13 నుంచి వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చి భారత జట్టు స్థాయికి ఎదిగిన ఆటగాళ్ల జాబితాలో మయాంక్‌ పేరు ఉంటుంది. 2010 అండర్‌–19 ప్రపంచ కప్‌ ఆడిన భారత జట్టులో సభ్యుడైన మయాంక్‌కు ఆరంభంలో పరిమిత ఓవర్ల ఆటగాడిగానే ముద్ర పడింది. అయితే ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌కూ తాను పనికొస్తానని నిరూపించుకున్నాడు. అతని కెరీర్‌లో కీలక మలుపు 2014–15 సీజన్‌. కర్ణాటక తరఫున ఓపెనర్‌గా నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్న తరుణంలో టోరీ్నలో జట్టు 11 మ్యాచ్‌లు ఆడితే మయాంక్‌ను నాలుగు మ్యాచ్‌లకే  తీసేశారు.  

ధ్యానంతో దారిలోకి...
శరీరంపై నియంత్రణ కోల్పోయి బాగా లావెక్కడంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ వేటుతో హెచ్చరిక జారీ చేసింది. దాంతో మయాంక్‌కు తన సమస్య అర్థమై ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి పెట్టాడు. ధ్యాన పద్ధతి ‘విపాసన’ కూడా పాటించి ప్రత్యేక సాధనతో సరైన ఆకారానికి వచ్చాడు. తర్వాతి సీజన్‌లో తొలి ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీ సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగిన మయాంక్‌కు ఆ తర్వాత ఎదురు లేకుండా పోయింది. దేశవాళీలో నిలకడగా రాణించిన తర్వాత  2017–18 సీజన్‌ మయాంక్‌ ఏమిటో ప్రపంచానికి చూపించింది. భారీ స్కోర్లు చేయడం కూడా అతను అలవాటుగా మలచుకున్నాడు.  

అవకాశాన్ని వదల్లేదు...
పృథ్వీ షా గాయపడటంతో అనూహ్యంగా ఆ్రస్టేలియాతో సిరీస్‌కు అవకాశం దక్కించుకున్న మయాంక్‌ దీనిని సమర్థంగా వాడుకున్నాడు. ఆప్త మిత్రుడు కేఎల్‌ రాహుల్‌ వైఫల్యంతో అతని స్థానంలోనే మెల్‌బోర్న్‌ టెస్టులో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన మయాంక్‌ 76, 42 స్కోర్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సిడ్నీలోనూ 77 పరుగులతో సత్తా చాటాడు. వెస్టిండీస్‌లో మరో అర్ధ సెంచరీ తర్వాత ఇప్పుడు తన ఐదో టెస్టులో తొలి సెంచరీనే డబుల్‌ సెంచరీగా మార్చుకున్నాడు.  

కలవారి కుటుంబం....
వ్యక్తిగతంగా చూస్తే మయాంక్‌ది వ్యాపారస్తుల, కలవారి కుటుంబం. గత ఏడాది అతను ఆషిత సూద్‌ను వివాహమాడాడు. ఆమె బెంగళూరు మాజీ పోలీస్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ సూద్‌ కుమార్తె. అయితే సహచర క్రికెటర్లతో పోలిస్తే అత్యంత నిరాడంబరంగా ఉండటమే మయాంక్‌ శైలి అని కన్నడ క్రికెట్‌ వర్గాలు అతని గురించి చెబుతాయి.  

మరిన్ని వార్తలు