క్రికెటర్ ను ఇంటర్వ్యూ చేసిన భార్య!

9 Sep, 2017 11:52 IST|Sakshi
క్రికెటర్ ను ఇంటర్వ్యూ చేసిన భార్య!

బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఆరంభమై వారం రోజులైనప్పటికీ అక్కడ  అదనపు ఆకర్షణ అనేది కరువైంది..ప్రధానంగా స్టార్ ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, మనీష్ పాండేలు అంతర్జాతీయ మ్యాచ్లో బిజీగా ఉండటంతో కర్ణాటక ప్రీమియర్ లీగ్ కు కళ తప్పింది. కాకపోతే, శుక్రవారం చోటు చేసుకున్న అరుదైన సంఘటనతో ఈ లీగ్ కు కాస్త జోష్ వచ్చింది. ఇందుకు కారణం ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, అతని భార్య మయాంతి లాంగర్లే. కర్ణాటక ప్రీమియర్ లీగ్ లో బెలగావీ పాంథర్స్ తరపున ఆడుతున్న స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్చూ చేసే అవకాశం స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఉన్న మయాంతికి వచ్చింది. బ్రాడ్ కాస్టింగ్ కవరేజ్ లో భాగంగా ఆ ఈవెంట్ కు హాజరైన మయాంతి.. భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్వ్యూ చేయడం అభిమానుల్లో మజాను తీసుకొచ్చింది.

వివరాల్లోకి వెళితే.. నిన్న బెంగాళూరు బ్లాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్టువర్ట్ బిన్నీ 46 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు నమోదు చేశాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెలగావీ పాంథర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 192 పరుగులు చేసింది. ఆపై బెంగళూరు బ్లాస్టర్స్  19.3 ఓవర్లలో169 పరుగులు చేసింది. ఇక్కడ స్టువర్ట్ బిన్నీ రెండు వికెట్లతో్ రాణించారు. దాంతో పాంథర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన  భర్త స్టువర్ట్ బిన్నీని ఇంటర్య్వూ చేసే అరుదైన అవకాశం మయాంతికి వచ్చింది.

ఇలా భర్తను భార్య ఇంటర్వ్యూ చేయడంపై ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. స్టువర్ట్ బిన్నీ రాణించడానికి భార్య మయాంతి అక్కడకు రావడమేనని ఒకరు అభిప్రాయపడగా, భర్తను ఇంటర్య్యూ చేయడం అత్యున్నతమైన గిఫ్ట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు.