షారుక్‌ను అనుమతించక తప్పదా!

15 May, 2014 01:09 IST|Sakshi
షారుక్‌ను అనుమతించక తప్పదా!

 ఐపీఎల్ షరతులతో సంకటంలో ఎంసీఏ
 ముంబై: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ విషయంలో నెలకొన్న వివాదం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఫైనల్ మ్యాచ్‌ను తిరిగి వాంఖడే స్టేడియానికే కేటాయించాలంటే తాము విధించే షరతులకు అంగీకరించాలని ఎంసీఏకు ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిశ్వాల్ సూచించిన సంగతి తెలిసిందే.
 
 అయితే ఈ షరతుల్లో ఫ్రాంచైజీ యజమానులందరినీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు తప్పనిసరిగా అనుమతించాలని ఉంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ యజమాని అయిన షారుక్‌ఖాన్‌నూ వాంఖడేలోకి అనుమతించాల్సి వస్తుంది. 2012లో కోల్‌కతా జట్టు ఫైనల్ మ్యాచ్‌లో నెగ్గాక ఎంసీఏ సిబ్బందితో షారుక్ గొడవకు దిగడంతో అతనిపై ఐదేళ్లపాటు నిషేధం విధించారు.
 
 వాంఖడేతోపాటు ఎంసీఏ పరిసరాల్లోకి కూడా షారుక్‌ను అనుమతించరాదని ఎంసీఏ అప్పటి అధ్యక్షుడు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఐపీఎల్ అధికారుల తాజా షరతుతో ఎంసీఏ సంకటంలో పడింది. షారుక్‌ను అనుమతించడమంటే అతనిపై నిషేధాన్ని ఎత్తివేయడమేనన్న అభిప్రాయంతో ఉంది. అయితే... ఫ్రాంచైజీ యజమానుల్ని ఫైనల్ మ్యాచ్‌కు తప్పనిసరిగా అనుమతించాలన్న నిబంధనేదీ ఐపీఎల్‌లో లేదని ఎంసీఏకు చెందిన వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు