'పాంటింగ్‌ గెలుపు కోసం చూస్తాడు.. ధోని మాత్రం'

9 May, 2020 11:30 IST|Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్‌ హస్సీ టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని పై ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ విషయంలో రికీ పాంటింగ్ కంటే ధోనినే బెటర్‌గా కనిపిస్తాడని హస్సీ పేర్కొన్నాడు. ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రాం లైవ్ చాట్‌లో పాల్గొన్న హస్సీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రికీ పాంటింగ్‌ సారధ్యంలో 2007 ప్రపంచకప్‌, 2006, 2009 చాంపియన్స్‌ ట్రోపీ గెలవడంలో హస్సీ కీలక పాత్ర పోషించాడు. ఇటు ఎంఎస్‌ ధోని సారధ్యంలోనూ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ గెలవడంలోనూ హస్సీ ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు కెప్టెన్సీలో ఆడిన మీరు ఎవరిని ఉత్తమ కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంటారనే ప్రశ్న హస్సీకి ఎదురైంది. (‘ఆ బ్యాట్‌తో ధోని ఆడొద్దన్నాడు’)

దీనికి హస్సీ స్పందిస్తూ' నా దృష్టిలో పాంటింగ్‌, ధోనిలిద్దరు అత్యుత్తమ కెప్టెన్లే. కానీ నాయకత్వ విషయంలో ఇద్దరి మధ్య చాలా వత్యాసాలు కనిపిస్తాయి. ముందుగా పాంటింగ్‌ విషయానికి వస్తే.. అతడికి నాయకత్వం వహించడం అంటే ఇష్టం. గెలవడం అంటే ఇంకా ఇష్టం. ప్రతి విషయంలోనూ కచ్చితత్వాన్ని కోరుకుంటాడు. చివరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా జట్టును ముందుండి నడిపిస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అతడే ఆ కష్టాన్ని ముందుగా ఎదుర్కొంటాడు. ఆటగాళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాడు. (దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌)

ఇదే లక్షణం ధోనిలోనూ కనబడుతుంది. మ్యాచ్‌ ఆసాంతం ధోని ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అనవసరంగా ఒత్తిడికి లోనయ్యే నిర్ణయాలను తీసుకోడు. బౌలర్లకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వారికి ఒత్తిడి తగ్గిస్తాడు. అయితే కొన్ని సార్లు ధోనీ తీసుకునే నిర్ణయాలు షాక్‌కు గురిచేస్తాయి. అయితే ఆ నిర్ణయాలు కచ్చితంగా పనిచేస్తూ ఫలితాలను రాబడతాయి. ధోనీకి తనపై తనకున్న నమ్మకమే అతను తీసుకునే నిర్ణయంలోనూ కనబడుతుంది. ఈ విషయంలో మాత్రం నేను పాంటింగ్‌ కంటే ధోనినే అత్యుత్తమమని చెప్పగలను' అంటూ పేర్కొన్నాడు. 2012లో ఆటకు రిటైర్మంట్‌ ప్రకటించిన మైక్‌ హస్సీ ఆస్ట్రేలియా తరపున 185 వన్డేలు, 79 టెస్టులు, 38 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నె సూపర్‌కింగ్స్‌ తరపున ఆడిన హస్సీ 2018 నుంచి అదే జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతున్నాడు.
(ధావన్‌ ఒక ఇడియట్‌..స్ట్రైక్‌ తీసుకోనన్నాడు..!)

మరిన్ని వార్తలు