నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన మిథాలీ

16 Oct, 2019 18:54 IST|Sakshi

సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలకు ట్రోలింగ్‌ బెడద తప్పడం లేదు. అనవసర విషయాలను హైలెట్‌ చేస్తూ సెలబ్రెటీలను ఇరుకున్న పెట్టాలని కొందరు నెటిజన్లు భావిస్తుంటారు. అయితే కొన్ని సార్లు సఫలమవుతే.. మరికొనిసార్లు విమర్శలపాలవుతుంటారు. తాజాగా టీమిండియా మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీ రాజ్‌ తనను ఇరుకున పెట్టాలని భావించిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. ఇటీవలే దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదే క్రమంలో మిథాలీ కెప్టెన్‌గా వందో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ మిథాలీని అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు. దీంతో చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన క్రికెట్‌ దిగ్గజం మెచ్చుకోవడం ఆనందంగా ఉందని మిథాలీ రీట్వీట్‌ చేసింది. 

అయితే మిథాలీ ట్వీట్‌పై సుగు అనే ఓ నెటిజన్‌ మిశ్రమంగా స్పందించింది. మిథాలీ మాతృభాష తమిళం అయినప్పటికీ ఎప్పుడూ ఆ భాష మాట్లడదని, కేవలం ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు భాషల్లోనే మాట్లాడుతుందని విమర్శించింది. అయితే ‘నా మాతృభాష తమిళమే. నేను ఈ భాషను బాగా మాట్లాడుతా. ఒక తమిళ వ్యక్తిగా జీవించడం గర్వపడుతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయురాలిగా గర్విస్తున్నా. నా ప్రతీ పోస్టుకు మీరు వెరైటీగా స్పందిస్తారు. అయితే మీ మాటలను సలహాలుగా తీసుకొని ముందుకుసాగుతా’అంటూ ఆ నెటిజన్‌కు మిథాలీ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. అంతేకాకుండా టేలర్‌ స్విఫ్ట్‌ పాటను కూడా షేర్‌ చేసింది. 

ప్రస్తుతం మిథాలీ ట్వీట్‌ తెగ వైరల్‌ అయింది. మిథాలీకి మద్దతు తెలుపుతూ సదరు నెటిజన్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల క్రికెట్‌ తలరాతను మార్చిన లెజండరీ క్రికెట్‌ మిథాలీ అని ప్రశంసిస్తున్నారు. ‘20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌.. అత్యధిక పరుగులు.. వంద కెప్టెన్సీ విజయాలు.. ఇవేమీ కనిపించలేదా కేవలం తన భాష మాత్రమే నీకు కనిపించిందా? దీంతో నువ్వేంటో అర్థం చేసుకోవచ్చు’అంటూ మరికొంత మంది మిథాలీకి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, మిథాలీ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను వైట్‌వాష్‌ చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు