అరెస్ట్‌ వారెంట్‌.. షమీ బెయిల్‌ ప్రయత్నాలు

7 Sep, 2019 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ : గృహహింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ పై కోల్‌కతాలోని అలిఫోర్‌ కోర్టు గత సోమవారం అరెస్టు వారెంట్‌ జారీ అయిన విషయం తెలిసిందే. కాగా వెస్టిండీస్‌ టూర్‌ సందర్భంగా అమెరికా వెళ్లిన షమీ అక్కడి నుంచే  బెయిల్‌ కోసం తన లాయర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 

షమీ అమెరికాలో ఉండిపోవడంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. "వెస్టిండీస్‌ పర్యటన ముగించుకున్న షమీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. సెప్టెంబర్‌ 12న షమీ భారత్‌కు తిరిగి రానున్నాడని, అంతవరకు తన లాయర్‌ సలీమ్‌ రెహమాన్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడని బోర్డు సభ్యుల్లో ఒక అధికారికి తెలిపినట్లు సమాచారం అందించాడు. కోర్టు షమీపై వేసిన చార్జ్‌షీట్‌ను పరిశీలించేవరకు బీసీసీఐ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోదని" వెల్లడించారు.

మహ్మద్‌ షమీ తనను వేదిస్తున్నాడంటూ గత ఏడాది మార్చిలో అతని భార్య హసీన్‌ జహాన్‌ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో గతేడాది కొద్ది రోజుల పాటు బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా విచారణ నిమిత్తం షమీ న్యాయస్థానానికి హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు.. షమీకి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తూ 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌ వారెంట్‌ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ కోసం షమీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఈ సందర్భంగా షమీ భార్య హసీన్‌ జహాన్‌ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాక్ష్యాలన్నీ తనకూ అనుకూలంగా ఉన్నాయని, ఈ కేసు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ షమీ తప్పించుకోలేడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 

మరిన్ని వార్తలు