పొలార్డ్ కు మురళీధరన్ మద్దతు

11 Apr, 2017 19:00 IST|Sakshi
పొలార్డ్ కు మురళీధరన్ మద్దతు

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా ముంబై ఇండియన్స్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఆటను తప్పుబడుతూ ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై సన్ రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ స్పందించాడు. ఒక ఆటగాడ్ని బహిరంగంగా తప్పుబట్టడం ఎంతటి వారికైనా సరికాదంటూ పొలార్డ్ కు మురళీ మద్దతుగా నిలిచాడు. అసలు పొలార్డ్ టాపార్డర్లో ఫిట్ కాలేడంటూ మంజ్రేకర్ ఎలా నిర్ణయిస్తాడని మురళీ ప్రశ్నించాడు. దాదాపు 10ఏళ్ల క్రికెట్ లో అనుభవం ఉన్న పొలార్డ్ ను పరిమిత ఓవర్ల ఆటగాడని మంజ్రేకర్ వ్యాఖ్యానించడం సరైనది కాదని ఈ దిగ్గజ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు.

 

'మంజ్రేకర్-పొలార్డ్ల వ్యవహారం కేవలం ఏ ఒక్క వ్యక్తికో సంబంధించినది కాదు. ఈ వివాదం చెలరేగడంలో ఇద్దరి పాత్ర ఉంది. టాపార్డర్ లో పొలార్డ్ పనికి రాడంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించకుండా ఉండాల్సింది. అలా చేయడం కచ్చితంగా ఒక ఆటగాడ్ని విమర్శించడమే. అందులోనూ బహిరంగంగా విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది. ట్వంటీ 20ల్లో ఏడువేల పరుగులకు దగ్గరగా ఉన్న ఆటగాడు టాపార్డర్ ఫిట్ కాలేడని మంజ్రేకర్ ఎలా అన్నాడు. అతను టాపార్డర్ లో సెట్ కాకపోతే అన్ని పరుగులు ఎలా చేస్తాడు. ఆ వ్యాఖ్యలు కచ్చితంగా బాధించేవిగా ఉన్నాయి. ఆ క్రమంలోనే మంజ్రేకర్ పై పొలార్డ్ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదు'అని  ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో పొలార్డ్ కు మురళీ ధరన్ మద్దతుగా నిలిచాడు.

 

మొన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో పొలార్డ్‌ ఔట్‌ అయిన సందర్భంలో... ఇన్నింగ్స్‌లో చివరి కొన్ని ఓవర్లకు మాత్రమే అతను పనికొస్తాడంటూ మంజ్రేకర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై పొలార్డ్‌ స్పందిస్తూ.. ‘నీ నోటి నుంచి సానుకూల మాటలు రావా. డబ్బులు ఇస్తారు కాబట్టి నీ నోటి దూలను కొనసాగించు. బుర్ర లేదని కూడా అన్నావు. మాటలు జాగ్రత్తగా వాడు. ఒక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేం’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు