అరంగేట్రం తర్వాత మళ్లీ జూనియర్‌ జట్టులోకి!

6 Dec, 2019 15:46 IST|Sakshi

కరాచీ:  ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌ జాతీయ క్రికెట్‌ తరఫున అరంగేట్రం చేసిన నసీమ్‌ షా మళ్లీ జూనియర్‌ జట్టులో సైతం చోటు దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగనున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌ జట్టు తమ జట్టును ప్రకటించింది. ఇందులో 16 ఏళ్ల నసీమ్‌ షాను ఎంపిక చేశారు. ఈ మేరకు పీసీబీ జూనియర్‌ నేషన్‌ సెలక్షన్‌ కమిటీ శుక్రవారం 15 మందితో కూడిన పాక్‌ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో నసీమ్‌ షాను ఎంపిక చేస్తూ పాక్‌ సెలక్టర్లు  నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నసీమ్‌  షా కేవలం తొలి టెస్టులో మాత్రమే ఆడి వికెట్‌ సాధించాడు.

154 పరుగులు సాధించిన డేవిడ్‌ వార్నర్‌ను ఎట్టకేలకు నసీమ్‌ షా ఔట్‌ చేశాడు. గతేడాది ఏసీసీ అండర్‌-19 ఆసియా కప్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహైల్‌ నజీర్‌ను అండర్‌-19 వరల్డ్‌కప్‌కు సైతం సారథిగా నియమించారు. పాక్‌ ప్రకటించిన జట్టులో ముగ్గురు  ఓపెనర్లు, ముగ్గురు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు, ఒక వికెట్‌ కీపర్‌, ముగ్గురు ఆల్‌ రౌండర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో 2004, 2006ల్లో  విజేతగా నిలిచిన పాకిస్తాన్‌.. ఈ మెగా టోర్నీ ఆరంభపు మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడనుంది.

>
మరిన్ని వార్తలు