బౌలర్లకు ‘బంధనాలు’, కెప్టెన్లకు తలనొప్పిగా మారిన కొత్త రూల్స్

22 Oct, 2013 11:16 IST|Sakshi
బౌలర్లకు ‘బంధనాలు’, కెప్టెన్లకు తలనొప్పిగా మారిన కొత్త రూల్స్
గత అక్టోబరు నుంచి వన్డేల్లో పరుగుల సంఖ్య బాగా పెరిగింది. 300 పైచిలుకు లక్ష్యాన్ని కూడా బ్యాట్స్‌మెన్ పట్టించుకోవడం లేదు. తాజాగా ఆస్ట్రేలియా-భారత్ వన్డే సిరీస్‌లో ఛేజింగ్ అనేది మంచినీళ్ల ప్రాయంగా కనిపిస్తోంది. దీనికి కారణం... వన్డేల్లో కొత్తగా వచ్చిన నిబంధనలు. ఇవి బౌలర్ల పాలిట శాపంగా మారాయి. పరుగుల వినోదంతో అభిమానులు సంతోషపడ్డా... కెప్టెన్లకు ఈ కొత్త రూల్స్ పెద్ద తలనొప్పిలా తయారయ్యాయి.
 
 సాక్షి క్రీడా విభాగం
 గత మూడు వన్డేల్లో భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గణాంకాలు 2/55, 1/50, 0/58.... అందరూ ఇషాంత్ శర్మ ఓవర్, అతని ప్రదర్శన గురించే తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కానీ మన గడ్డపైన ఎప్పుడూ బలంగా భావించే స్పిన్ కూడా తేలిపోయింది. అశ్విన్ ప్రదర్శనే దీనికి ఉదాహరణ. జట్టుకు అవసరమైన కీలక సందర్భాల్లో వికెట్ తీయగల సామర్థ్యం ఉందని కెప్టెన్ ధోని అమితంగా నమ్మే అశ్విన్ కూడా చేతులెత్తేస్తున్నాడు. ఇదంతా వన్డేల్లో ఐసీసీ కొత్త నిబంధనల పుణ్యమే. మొదటినుంచి దీనిపై గగ్గోలు పెడుతున్న ధోనికి ఇప్పుడిప్పుడే ఇది పూర్తి స్థాయిలో అనుభవంలోకి వస్తోంది. నాణ్యమైన పేస్ బౌలింగ్ లైనప్ ఉన్న జట్లకు ఈ నిబంధనలతో బాగా ఇబ్బంది లేకపోయినా... ఉపఖండం జట్లకు మాత్రం ఇవి తలనొప్పిగానే మారాయి. దీంతో బీసీసీఐ కూడా నిబంధనలు మార్చాలంటూ మళ్లీ ఐసీసీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. 
 
 స్పిన్నర్లకు దారేది!
 వన్డేల్లో నిబంధనలు మార్చిన తర్వాతే భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్‌లో ముక్కోణపు సిరీస్ కూడా గెలిచింది. అయితే అక్కడ మన పేస్ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో జట్టును నిలబెట్టారు. అదే భారత గడ్డకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. మన బ్యాటింగ్ ఎప్పుడైనా పటిష్టమే...కానీ ఇక్కడ ప్రత్యర్థిని దెబ్బ తీయడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు. అయితే గత పది నెలల కాలంలో మన జట్టు సొంత గడ్డపై ఆడిన 11 వన్డేల్లో 6 ఓడిపోయింది. మన దేశంలో టీమిండియాకు ఉండే రికార్డుతో పోలిస్తే ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పవర్‌ప్లే లేని సమయంలో సర్కిల్ బయట గతంలో ఐదుగురు ఫీల్డర్లు ఉండేవారు. 
 
 దానిని నాలుగుకు తగ్గించారు. ఇది స్పిన్నర్లపై ఒత్తిడి పెంచుతోంది. సాధారణంగా వన్డేల్లో ఊరించే ఫ్లయిట్ బంతులు వేసి ‘డీప్’లో క్యాచ్ ఇచ్చే వ్యూహంతో స్పిన్నర్లు వికెట్లు రాబట్టేవారు. ఇప్పుడు ఒక ఫీల్డర్ తగ్గడంతో ఆ రకమైన అటాకింగ్ బౌలింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. మరో వైపు జడేజా, యువరాజ్‌లను వికెట్ తీయగల బౌలర్లుగా చెప్పలేం. ధోని అప్పజెప్పిన బాధ్యత ప్రకారం ప్రత్యర్థికి పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడమే వారి పని. ఆసీస్‌తో మూడో వన్డేలో వారు అదే చేయగలిగారు. ‘రెండు బంతుల నిబంధన’ కూడా మన స్పిన్నర్లకు ఇబ్బందికరంగా మారింది. మ్యాచ్ ముగిసే వరకు కూడా బంతులు కొత్తవిగానే ఉంటుండటంతో బంతిని తిప్పేందుకు స్పిన్నర్లు పట్టు చిక్కడం లేదు.
 
 నెత్తిన బౌన్సర్...
  ఇక మరో నిబంధన కూడా మనకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేయవచ్చన్న రూల్‌ను ప్రత్యర్థి జట్లన్నీ సమర్థంగా ఉపయోగించుకుంటున్నాయి. మనకు మాత్రం ఈ నిబంధన ఎందుకూ పనికి రాకుండా పోతోంది. ‘ఒక బౌన్సరే వేయలేం. ఇంక రెండోది ఎక్కడ’...అంటూ దీనిపై గతంలోనే ధోని తన అసంతృప్తిని వెల్లడించాడు. ఎక్కువ శాతం బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఉన్న ఐసీసీ నిబంధనల్లో కాస్త బౌలర్లకు ప్రయోజనం కలిగించే రూల్ ఇదే అయినా... ఉపఖండం జట్లకు ఇది మాత్రం పెద్దగా ఉపయోగ పడటం లేదు. 
 
 ఇలా అయితే ఎలా...
 మొహాలీలో వన్డేకు ముందు టాస్ సందర్భంగా ధోని తన మనసులో మాటను మళ్లీ చెప్పాడు. ‘అసలు ఈ కొత్త నిబంధనలతో మమ్మల్నేం చేయాలనుకుంటున్నారో నాకు తెలీడం లేదు’ అని బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ఫీల్డర్ల పరిమితి నిబంధన భారత కెప్టెన్‌ను ఎక్కువగా చికాకు పెడుతోంది. అసలే అంతంత మాత్రం ఫీల్డర్లు అయిన మన ఆటగాళ్లను ఎక్కడ నిలబెట్టాలో కూడా అర్థం కావడం లేదు.
 
  ముఖ్యంగా ఫీల్డ్‌లో భారంగా కదిలే ఇషాంత్, అశ్విన్‌లను సర్కిల్ బయట ఉంచి పరుగులు నిరోధించడం కూడా కష్టంగా మారింది. మొత్తానికి ఈ నిబంధనలు భారత్‌కు సొంత గడ్డపై కూడా విజయాలను దూరం చేస్తున్నాయి. కెప్టెన్ ధోని కూడా సరేలెమ్మని సర్దుకుపోతాడో లేక ధిక్కారము సైతునా... అంటూ బీసీసీఐ మళ్లీ ఐసీసీపై ఆగ్రహం ప్రదర్శించి అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి. 
 
మరిన్ని వార్తలు