ఇంగ్లండ్‌ను కసిగా కొట్టారు..

25 Nov, 2019 10:36 IST|Sakshi

మౌంట్‌ మాంగని (న్యూజిలాండ్‌): వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ కౌంట్‌ నిబంధనతో మెగా టైటిల్‌ను అందుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన న్యూజిలాండ్‌.. ఇటీవల అదే జట్టుతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌ను, అందులోనూ సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో చేజార్చుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ కివీస్‌ను కొంప ముంచింది సూపర్‌ ఓవరే. చాలాకాలం తర్వాత ఇంగ్లండ్‌ను కసిగా కొట్టింది కివీస్‌. ఇంగ్లిష్‌ జట్టుపై ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది.

ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 65 పరుగుల తేడాతో గెలిచి శభాష్‌ అనిపించింది. ముందు బ్యాటింగ్‌లో కుమ్మేసిన కివీస్‌.. ఆపై బౌలింగ్‌లోనూ చెలరేగిపోయి ఇంగ్లండ్‌ను పేకపేడలా కూల్చేసింది. ఇంగ్లండ్‌ను ఏ దశలోనూ కోలుకోనీయకుండా చేసి సిరీస్‌లో శుభారంభం చేసింది. కనీసం ఈ మ్యాచ్‌ను డ్రా చేద్దామని ప్రయత్నించిన ఇంగ్లండ్‌కు చివరకు ఘోర పరాజయం తప్పలేదు.

55/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ 197 పరుగులకే చాపచుట్టేసింది. అటు పేస్‌ ఇటు స్పిన్‌ ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లండ్‌ వరుసగా వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది.  ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో బర్న్స్‌(31), జో డెన్లీ(35), బెన్‌ స్టోక్స్‌(28), సామ్‌ కర్రాన్‌(29), జోఫ్రా ఆర్చర్‌(30)లు కాసేపు పోరాడినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కివీస్‌ బౌలర్లలో పేసర్‌ నీల్‌ వాగ్నర్‌ ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. చివరి ఏడు వికెట్లలో ఐదు వికెట్లను వాగ్నర్‌ సాధించి ఇంగ్లండ్‌ను చావు దెబ్బకొట్టాడు. అంతకుముందు ఆఫ్‌ స్పిన్నర్‌ సాన్‌ట్నర్‌ మూడు వికెట్లు సాధించాడు. టిమ్‌ సౌథీ, గ్రాండ్‌ హోమ్‌లకు తలో వికెట్‌ లభించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేయగా, కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో  615/9 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో విజయంతో కివీస్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు  శుక్రవారం ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు