ట్రై సిరీస్‌ విజేత పాకిస్తాన్‌

8 Jul, 2018 16:55 IST|Sakshi

హరారే: ఆతిథ్య జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. ఆదివారం ఆసీస్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్‌ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్‌ 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్తాన్‌ ఆటగాళ్లలో షహిబ్‌జాదా ఫర్హాన్‌, హుస్సేన్‌ తలాట్‌లు డకౌట్లగా నిరాశపరిచినప్పటికీ, ఫకార్‌ జమాన్‌(91; 46 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి జతగా షోయబ్‌ మాలిక్‌(43 నాటౌట్‌), సర్ఫరాజ్‌ అహ్మద్‌(28)లు తలో చేయి వేయడంతో పాకిస్తాన్‌ సునాయాసంగా విజయాన్ని సాధించింది.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు డీఆర్సీ షార్ట్‌(76;53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు), అరోన్‌ ఫించ్‌(47; 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు.

మరిన్ని వార్తలు