సిగ్గు పడాల్సిందేమీ లేదు

20 Jun, 2017 00:10 IST|Sakshi
సిగ్గు పడాల్సిందేమీ లేదు

ఫైనల్లో పరాజయంపై కోహ్లి వ్యాఖ్య ∙
జట్టుగా మేం గర్వపడుతున్నామన్న కెప్టెన్‌


లండన్‌: చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌ చేతిలో చిత్తుగా ఓడినా టోర్నీలో తమ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. ఒక జట్టుగా తమపై ఉండే అంచనాలు, ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటే ఫైనల్‌ చేరడం కూడా చెప్పుకోదగ్గ ఘనతగా అతను అభివర్ణించాడు. ‘జట్టుగా మేమంతా గర్వించే ప్రదర్శన కనబర్చాం. మేం ఠీవిగా తలెత్తుకొని నిలబడగలం. ఫైనల్‌ దాకా వచ్చేందుకు ప్రతీ ఒక్కరు శ్రమించారు. తుది పోరులో ప్రత్యర్థి అన్ని రంగాల్లో మమ్మల్ని వెనక్కి నెట్టింది.

ఈ మ్యాచ్‌లో మా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించలేదని అంగీకరించేందుకు మేమేమీ సిగ్గు పడటం లేదు’ అని కోహ్లి అన్నాడు. ఛేదనలో తాము సమష్టిగా విఫలమయ్యామన్న విరాట్‌... హార్దిక్‌ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. గత కొన్నాళ్లుగా పాండ్యా పదే పదే విఫలమైనా కెప్టెన్‌ అతనిపై నమ్మకాన్ని కోల్పోలేదు. ‘హార్దిక్‌ బ్యాటింగ్‌ కళ్లు తిప్పుకోలేని విధంగా సాగింది. ఆ సమయంలో మేం లక్ష్యానికి చేరువ కాగలమని కూడా అనిపించింది.

అయితే అలాంటి సమయాల్లో రనౌట్‌లాంటి పొరపాట్లు సహజం. అవుటయ్యాక పాండ్యా తన భావోద్వేగాలు ప్రదర్శించడంలో తప్పు లేదు. అలాంటి ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌ తర్వాత నిరాశ పడటం సహజమే. పట్టుదలగా ఆడుతున్న సమయంలో తన ప్రమేయం లేకుండా అవుట్‌ కావడంతో అసహనం చెందడం సహజమే’ అని కోహ్లి తన సహచరుడికి మద్దతు పలికాడు.

అశ్విన్‌పై భరోసా...
చాంపియన్స్‌ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన భారత ఆటగాళ్ల జాబితాలో స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా ఉన్నాడు. 3 మ్యాచ్‌లలో కలిపి అతను 167 పరుగులిచ్చి ఒక వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. ఫైనల్లో అయితే ఫఖర్‌ జమాన్‌ చెలరేగిపోయాడు. అశ్విన్‌ బౌలింగ్‌లోనే అతను ఏకంగా 45 పరుగులు బాదాడు. మరో స్పిన్నర్‌ జడేజా కూడా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించిన తన నిర్ణయంలో తప్పు లేదని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘ఇలాంటి బ్యాటింగ్‌ పిచ్‌పై స్పిన్నర్లకు సహజంగానే పెద్ద సవాల్‌ ఎదురవుతుంది.

ఇక బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోయి అడ్డంగా షాట్లు ఆడుతున్న సమయంలో అయితే స్పిన్నర్లు ఏమీ చేయలేరు. బౌండరీలు ఇవ్వకుండా ఉండటం మానవమాత్రులకు సాధ్యం కాదు. శ్రీలంకతో పరాజయం తర్వాత జట్టులో మార్పులు చేశాం. అదే వ్యూహానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇద్దరు స్పిన్నర్లతో ఆడాం’ అని కోహ్లి వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో కూడా దాదాపు ఇదే జట్టు ఉంటుంది కాబట్టి తప్పులను సరిదిద్దుకొని మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని విరాట్‌ స్పష్టం చేశాడు.  

కుంబ్లేతో సయోధ్య మిథ్యేనా!
మరోవైపు భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ అనిల్‌ కుంబ్లే మధ్య విభేదాలు సమసిపోయేలా కనిపించడం లేదు. సర్దుకుపొమ్మంటూ వీరిద్దరిని కలిపి ఉంచేందుకు బీసీసీఐ, మాజీ క్రికెటర్లు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం.  క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులు సచిన్, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతోపాటు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, సీఈఓ రాహుల్‌ జోహ్రి, జనరల్‌ మేనేజర్‌ ఎంవీ శ్రీధర్‌ ఫైనల్‌కు ముందు శనివారం కోహ్లితో గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఇక కోహ్లి, కుంబ్లే కలిసి పని చేయడం కష్టమనే నిర్ణయానికి వీరు వచ్చారు.

‘కుంబ్లే గురించి తన ఆలోచనలు ఏమిటో కోహ్లి స్పష్టంగా చెప్పేశాడు. అతని లెక్కలు అతనికున్నాయి. కోహ్లి వైపు నుంచి చూస్తే ఇరువురి మధ్య సంబంధం సరిదిద్దలేని విధంగా చేయి దాటిపోయింది. ఇక సీఏసీ సభ్యులు కుంబ్లేతో మాట్లాడి ఏదైనా సయోధ్యకు అవకాశం ఉంటుందేమో ప్రయత్నిస్తారు’ అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. అయితే తాజా పరిణామాలు భారత క్రికెట్‌కు చెడు చేస్తాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

 ‘కోచ్‌గా కుంబ్లే రికార్డు అద్భుతంగా ఉంది. అసలు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఆయనను తొలగిస్తాం? ఈ విషయంలో కెప్టెన్‌ మాటకు ఎంతవరకు విలువ ఇవ్వాలి? అతను ఎంత అద్భుతమైన ఆటగాడు అయినా మొత్తం అతనికే అప్పగించేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు. తర్వాత వచ్చే కోచ్‌తో కూడా కొద్ది రోజులకే కోహ్లికి విభేదాలు వస్తే అప్పుడు ఏం చేస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

భారత్‌ ఓటమితో బంగ్లా యువకుడి ఆత్మహత్య
ఢాకా: భారత క్రికెట్‌కు వీరాభిమాని అయిన 25 ఏళ్ల బంగ్లాదేశ్‌ యువకుడు బిద్యుత్‌ ... చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌ చేతిలో భారత్‌ ఓడటాన్ని జీర్ణించుకోలేక నడుస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టీమిండియా ఓటమిని తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని  స్థానిక  పోలీసు అధికారి ఇస్లామ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు