నిషేధం తర్వాత పృథ్వీ షా మెరుపులు

17 Nov, 2019 13:43 IST|Sakshi

ముంబై: నిషేధిత ఉత్ప్రేరకం వాడి నిషేధానికి గురై ఇటీవల క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన ముంబై ఓపెనర్‌ పృథ్వీ షా తన బ్యాటింగ్‌లో పవర్‌ చూపించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ ఆలీ టీ20 ట్రోఫీలో భాగంగా ఆదివారం అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా మెరుపులు మెరిపించాడు. టాస్‌ గెలిచిన అస్సాం ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో ఆ జట్టు ఇన్నింగ్స్‌ను పృథ్వీ షా, ఆదిత్యా తారేలు ఆరంభించారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్‌ ముంబై స్కోరును పరుగులు పెట్టించారు.

పృథ్వీ షా 39 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్సర్లతో 63 పరుగులు చేయగా, ఆదిత్యా తారే 48 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. నిషేధిత డ్రగ్‌ వాడిన పృథ్వీషాపై 8 నెలలు నిషేధం పడింది. కొన్ని రోజుల క్రితం అతనిపై ఉన్న నిషేధం ముగియడంతో తిరిగి క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. దాంతో ప్రస్తుత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ సీజన్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో పృథ్వీషాకు ఇదే తొలి మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో ముంబై 83 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా, అస్సాం 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేసింది. దాంతో ముంబై ఖాతాలో మరో విజయం చేరింది.

మరిన్ని వార్తలు