దుమ్మురేపిన పూజారా.. చరిత్ర సృష్టించే దిశగా స్మిత్‌!

19 Dec, 2017 18:29 IST|Sakshi

దుబాయ్‌: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన చటేశ్వర పుజారా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. తాజాగా వెలువడిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఇది పూజారా కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌. యాషెస్‌లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 945 పాయింట్లతో మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. అతడు మరో 16 పాయింట్లు సాధిస్తే.. బ్యాటింగ్‌ దిగ్గజం బ్రాడ్‌మన్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ను అందుకుంటాడు. ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే అంత కష్టం కాకపోవచ్చు.

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 863పాయింట్లతో రెండో ర్యాంకు సాధించాడు. ఇక, టెస్టు బౌలర్లలో యాషెస్‌ సిరీస్‌లో ఫామ్‌ను కొనసాగిస్తున్న ఇంగ్లండ్‌ బౌలర్‌ అండర్సన్‌, రబాడాను వెనక్కినెట్టి మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. భారత బౌలర్లలో స్పిన్‌ ద్వయం అశ్విన్‌, జడేజాలు మూడు, నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా రెండో స్థానంలో, అశ్విన్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. యాషెస్‌ సిరీస్‌లో ప్రధానంగా రాణిస్తున్న ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లోనూ మార్పులు జరిగాయి.

మరిన్ని వార్తలు