ఆసీస్ ను ఆడేసుకుంటున్నారు..

19 Mar, 2017 15:14 IST|Sakshi
ఆసీస్ ను ఆడేసుకుంటున్నారు..

రాంచీ: నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పైచేయి సాధించింది. నాల్గో రోజు ఆటలో భారత టాపార్డర్ ఆటగాళ్లు చటేశ్వర పుజారా, వృద్ధిమాన్ సాహాలు అత్యంత నిలకడగా ఆడుతూ ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. దాంతో 360/6 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు తొలి రెండు సెషన్లు పూర్తయ్యే సరికి మరో వికెట్ కోల్పోకుండా 503 పరుగులు చేసింది. దాంతో భారత్ కు 52 పరుగుల ఆధిక్యం లభించింది. లంచ్, టీ విరామాలు పూర్తయ్యే సరికి 58 ఓవర్లు పాటు బౌలింగ్ చేసిన ఆసీస్ జట్టు కనీసం వికెట్ ను కూడా సాధించలేకపోయింది.

 

ప్రధానంగా చటేశ్వర పుజారా-సాహాలు  ఆసీస్ ను ఆడేసుకుంటున్నారు. ఎటువంటి తడబాటు లేకుండా 175 పరుగులకు పైగా అజేయ భాగస్వామ్యాన్ని సాధించి భారత్ ను పటిష్ట స్థితికి చేర్చారు. ఈ క్రమంలోనే సాహా 214 బంతుల్లో 7ఫోర్లు 1 సిక్సర్ సాయంతో శతకం పూర్తి చేయగా, పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. 521బంతుల్లో పుజారా డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.


రివ్యూలు కోల్పోయిన ఆసీస్

నాల్గో రోజు ఆటలో రివ్యూల విషయంలో ఆసీస్ కు నిరాశే ఎదురైంది. తొలి సెషన్ ముగిసే సరికి ఒక రివ్యూను కోల్పోయిన ఆసీస్.. రెండో సెషన్ లో మరొక రివ్యూను చేజార్చుకుంది. మొత్తంగా మూడు సార్లు రివ్యూకు వెళ్లిన ఆసీస్ ఒకసారి మాత్రమే అందులో సఫలమైంది. దాంతో ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో రివ్యూలు లేకుండా పోయాయి. మరొకవైపు భారత్ తన రివ్యూలను అలానే కాపాడుకుంది. రెండుసార్లు రివ్యూలకు వెళ్లిన భారత్ వాటిలో సక్సెస్ అయ్యింది. తొలుత పుజారా ఎల్బీ విషయంలో ఆపై సాహా క్యాచ్ విషయంలో భారత్ తన రివ్యూలను నిలబెట్టుకుంది.

 

మరిన్ని వార్తలు