'సూపర్' సింధు

18 Oct, 2015 01:17 IST|Sakshi
'సూపర్' సింధు

 సెమీస్‌లో ప్రపంచ చాంపియన్‌పై
 అద్భుత విజయం
 తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లోకి
 నేడు ఒలింపిక్ చాంప్ లీ జురుయ్‌తో అమీతుమీ
 డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ


 ఒడెన్స్ (డెన్మార్క్): గాయాల కారణంగా ఈ సీజన్‌లో అంతంత మాత్రంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... పూర్తి ఫిట్‌నెస్ సంతరించుకున్నాక తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ అమ్మాయి అత్యద్భుత ఆటతీరుతో అదుర్స్ అనిపించింది. ప్రతి రౌండ్‌లో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను మట్టికరిపించి తన కెరీర్‌లో తొలిసారి ‘సూపర్ సిరీస్’ స్థాయి టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
 
  శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21-15, 18-21, 21-17తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు కీలకదశలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో 14-16తో వెనుకబడిన దశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. ఆ తర్వాత మారిన్ రెండు పాయింట్లు సాధించినా, సింధు వెంటనే తేరుకొని మరో పాయింట్ సాధించి చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది.
 
  ముఖాముఖి రికార్డులో మారిన్‌పై సింధుకిది రెండో విజయం. చివరిసారి 2011లో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ టోర్నీలో మారిన్‌ను ఓడించిన సింధు నాలుగేళ్ల తర్వాత ఆమెపై మళ్లీ గెలిచింది. ఈ ఏడాది సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ ఫైనల్లో, గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మారిన్ చేతిలో సింధు ఓడింది. ఈసారి మాత్రం పక్కాగా సిద్ధమై అనుకున్న ఫలితాన్ని సాధించింది.
 
   శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21-18, 21-19తో ప్రపంచ మాజీ చాంపియన్, ఏడో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించింది. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యిహాన్ వాంగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఆమె చేతిలో ఓటమి చవిచూసింది.  నేడు (ఆదివారం) జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సింధు, లీ జురుయ్ 2-2తో సమఉజ్జీగా ఉన్నారు.
 
 ఫైనల్ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు