'వేగం'లో కోహ్లి కంటే..

11 Feb, 2016 16:22 IST|Sakshi
'వేగం'లో కోహ్లి కంటే..

సెంచూరియన్:విరాట్ కోహ్లి.. టీమిండియా జట్టులో కీలక క్రికెటర్. కోహ్లి క్రీజ్ లో ఉన్నాడంటే కొండంత భరోసా. మ్యాచ్ మనదే అనే ధైర్యం. సచిన్ రికార్డులను అధిగమించే సత్తా ఉన్న ఆటగాడు ఎవరనే ప్రశ్నకు సమాధానంగా మొట్టమొదట వినిపించే పేరు విరాట్ కోహ్లి. అంచనాలకు తగ్గట్టే వేగంగా పరుగులు సాధిస్తూ కోహ్లి దూసుకుపోతున్నాడు. అయితే దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్ చక్కటి ఆటతీరుతో కోహ్లిని మరిపిస్తున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో శతకం సాధించిన డీకాక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది సెంచరీలు కొట్టిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.

 

దాంతో పాటు ఇంగ్లండ్ పై సెంచరీతో  పిన్నవయసులో 10 సెంచరీలు సాధించిన ఆటగాడిగా , 55 ఇన్నింగ్స్ లలో పది శతాకాలు చేసిన దశ ధీరుడిగా నిలిచాడు. డీకాక్ 23 సంవత్సరాల 54 రోజుల వయసులో 10 సెంచరీలు చేస్తే,  అదే  విరాట్ 10 సెంచరీలు  చేసే సమయానికి  23 సంవత్సరాల 159 రోజులు. మరోవైపు విరాట్ తొలి 10 శతకాలు బాదడానికి 80 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. ఇదే విరాట్ కోహ్లి ఆటలోని వేగం కన్నా డీకాక్ వేగం మెరుగ్గా ఉందనే విషయాన్ని బలపరుస్తోంది. ఇదిలా ఉంటే తన సహచర ఆటగాడు, దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా రికార్డును కూడా డీకాక్ అధిగమించాడు. ఆమ్లా 57 ఇన్నింగ్స్ లలో నెలకొల్పిన 10 సెంచరీల రికార్డును డీకాక్ సవరించాడు.

మరిన్ని వార్తలు