రహ్మత్‌ షా శతకం

6 Sep, 2019 02:44 IST|Sakshi
రహ్మత్‌ షా

అఫ్గాన్‌ 271/5

బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు

చిట్టగాంగ్‌: అఫ్గానిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ రహ్మత్‌ షా (187 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) పేరు ఆ దేశ టెస్టు క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. బంగ్లాదేశ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్టులో సెంచరీ బాదిన అతడు అఫ్గాన్‌ తరఫున ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. షాకు తోడు అస్గర్‌ అఫ్గాన్‌ (160 బంతుల్లో 88 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి అఫ్గాన్‌ ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌... ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్‌ (21), ఇహ్‌సానుల్లా (9) వికెట్లను త్వరగానే కోల్పోయింది.

లంచ్‌ సమయానికి నాలుగో నంబరు బ్యాట్స్‌మన్‌ హష్మతుల్లా షహీదీ (14) కూడా ఔట్‌ కావడంతో జట్టు 77/3తో నిలిచింది. ఈ దశలో షా, అస్గర్‌ నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ వెంటనే నబీ (0) వెనుదిరిగాడు. అస్గర్, వికెట్‌ కీపర్‌ అఫ్సర్‌ జజాయ్‌ (90 బంతుల్లో 35 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, సిక్స్‌) ఆరో వికెట్‌కు అబేధ్యంగా 74 పరుగులు జోడించి రోజును ముగించారు. స్పిన్నర్ల పైనే భరోసా ఉంచిన బంగ్లా ఈ మ్యాచ్‌కు ప్రధాన పేసర్లు లేకుండానే బరిలో దిగింది. ఆ జట్టు తరఫున 8 మంది బౌలింగ్‌ చేయడం గమనార్హం.

రషీద్‌... చిన్న వయసు టెస్టు కెప్టెన్‌
బంగ్లాతో టెస్టులో అఫ్గాన్‌కు నాయకత్వం వహించడం ద్వారా మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (20 ఏళ్ల 350 రోజులు) అతి చిన్న వయసు కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు జింబాబ్వేకు చెందిన తతెంద తైబు (20 ఏళ్ల 358 రోజులు– 2004లో శ్రీలంకపై) పేరిట ఉన్న రికార్డును రషీద్‌ సవరించాడు. 1962లో 21 ఏళ్ల 77 రోజుల వయసులో భారత్‌కు సారథ్యం వహించిన దివంగత మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ... అతి చిన్న వయసు కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు