చెన్నై సూపర్‌ రాయుడు

23 Apr, 2018 03:23 IST|Sakshi

సొంతగడ్డపై అంబటి అద్భుత ఇన్నింగ్స్‌

4 పరుగులతో సూపర్‌ కింగ్స్‌ విజయం

ఆఖరి బంతికి ఓడిన సన్‌రైజర్స్‌ 

విలియమ్సన్‌ శ్రమ వృథా

ఐపీఎల్‌లో మరోసారి ఆఖరి బంతి మాయ చేసింది. ఈ సీజన్‌లో ఒకసారి చివరి బంతికి గెలిచి మరోసారి ఆఖరి బంతికి ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ పక్షానే మరోసారి చివరి బంతి నిలిచింది. మూడు బంతుల్లో16 పరుగులు కావాల్సిన స్థితిలో బ్రేవో బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ఉత్కంఠ పెంచిన రషీద్‌ ఖాన్‌ చివరి బంతికి సింగిల్‌కు పరిమితం కావడంతో రైజర్స్‌కు వరుసగారెండో పరాజయం ఎదురైంది. ఉప్పల్‌లో తమ గత మ్యాచ్‌లో ఆఖరి బంతికే ఫోర్‌తో గట్టెక్కిన హైదరాబాద్‌ ఈసారి గెలుపు గీత దాటలేకపోయింది. తొలి బంతి నుంచి దాదాపు ఒకే తరహాలో సాగిన మ్యాచ్‌లో చివరకు హైదరాబాద్‌పై చెన్నైదే పైచేయి అయింది. రెండు అత్యుత్తమ ప్రదర్శనల్లో అంబటి తిరుపతి రాయుడు గెలుపు వైపు నిలబడగా... విలియమ్సన్‌ ఓటమి పక్కనే నిలవాల్సి వచ్చింది.   

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస విజయాలతో జోరు పెంచింది. ఆదివారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అంబటి రాయుడు (37 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌కు సురేశ్‌ రైనా (43 బంతుల్లో 54 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 112 పరుగులు జోడించడం విశేషం. అనంతరం రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేయగలిగింది. విలియమ్సన్‌ (51 బంతుల్లో 84; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్‌కు తోడు యూసుఫ్‌ పఠాన్‌ (27 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్సర్లు) రాణించినా లాభం లేకపోయింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 45 బంతుల్లోనే 79 పరుగులు జత చేశారు. దీపక్‌ చహర్‌కు 3 వికెట్లు దక్కాయి.

భారీ భాగస్వామ్యం...
2, 2, 4... తొలి మూడు ఓవర్లలో చెన్నై చేసిన పరుగులు ఇవి. గత మ్యాచ్‌ సెంచరీ హీరో వాట్సన్‌ పరుగులు తీసేందుకు తీవ్రంగా తడబడ్డాడు. భువీ వేసిన నాలుగో ఓవర్లో భారీ సిక్స్‌ కొట్టిన వాట్సన్‌ (9) తర్వాతి బంతికే వెనుదిరగడంతో ఆ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న డు ప్లెసిస్‌ (11) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఆరు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేసిన చెన్నై ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో అతి తక్కువ పరుగులు నమోదు చేసిన జట్టుగా గుర్తింపు పొందింది. అయితే రైనా, రాయుడు జత కలిసిన తర్వాత ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. పది ఓవర్లు ముగిసేసరికి 54 పరుగులు మాత్రమే ఉన్న చెన్నై స్కోరు వీరిద్దరి జోరుతో వేగంగా దూసుకుపోయింది.

రషీద్‌ ఓవర్లో రైనా వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టి దూకుడు పెంచాడు. ఈ జంట విధ్వంసం సృష్టిస్తున్న తరుణంలో సమన్వయ లోపం రాయుడు రనౌట్‌కు కారణమైంది. కౌల్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసిన అనంతరం ఓవర్‌త్రోకు మరో పరుగు చేసేందుకు వీరిద్దరు ప్రయత్నించారు. రైనా పిలుపుపై రాయుడు ముందుకు దూసుకొచ్చాడు. అయితే బంతి దగ్గరలోనే ఉండటం గమనించి రైనా మళ్లీ నివారించడంతో వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించి రాయుడు విఫలమయ్యాడు. అనంతరం 39 బంతుల్లో రైనా అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో ధోని (12 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ధాటిగా ఆడటంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. భువనేశ్వర్‌ స్థాయి బౌలర్‌ పూర్తి కోటా వేయలేకపోవడం సన్‌ వ్యూహ వైఫల్యాన్ని చూపించింది.  

విలియమ్సన్‌ మెరుపులు...
గత ఐదు సీజన్లలో వార్నర్, ధావన్‌ లేకుండా తొలి మ్యాచ్‌ ఆడుతున్న సన్‌రైజర్స్‌ ఊహించినట్లుగానే తడబడింది. రెండు ఏళ్ల పాటు జట్టులో సభ్యుడిగా ఉన్నా మ్యాచ్‌ దక్కని రికీ భుయ్‌ తొలి అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. తీవ్ర ఒత్తిడిలో ఓపెనింగ్‌ చేసి భుయ్‌ (0) ఐదో బంతికి డకౌటయ్యాడు. పాండే (0), హుడా (1) కూడా అతడినే అనుసరించడంతో సన్‌ 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు చహర్‌కే దక్కడం విశేషం. ఇలాంటి దశలో విలియమ్సన్, షకీబ్‌ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి ఆదుకున్నారు.

షకీబ్‌ అవుటయ్యాక విలియమ్సన్, పఠాన్‌ జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి వేగంగా పరుగులు సాధించడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. ముఖ్యంగా కరణ్‌ శర్మ వేసిన ఓవర్లో విలియమ్సన్‌ మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో 22 పరుగులు వచ్చాయి. బ్రేవో వేసిన తర్వాతి ఓవర్లో పఠాన్‌ మరో రెండు సిక్సర్లు బాదాడు. అయితే ఏడు పరుగుల వ్యవధిలో వీరిద్దరు అవుట్‌ కావడంతో చెన్నై ఊపిరి పీల్చుకుంది.

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (సి) హుడా (బి) భువనేశ్వర్‌ 9; డు ప్లెసిస్‌ (స్టంప్డ్‌) సాహా (బి) రషీద్‌ ఖాన్‌ 11; సురేశ్‌ రైనా నాటౌట్‌ 54; అంబటి రాయుడు రనౌట్‌ 79; ధోని నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 182.
వికెట్ల పతనం: 1–14, 2–32, 3–144.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3–0–22–1, స్టాన్‌లేక్‌ 4–0–38–0, షకీబ్‌ 4–0–32–0, సిద్ధార్థ్‌ కౌల్‌ 4–0–33–0, రషీద్‌ ఖాన్‌ 4–0–49–1, దీపక్‌ హుడా 1–0–8–0.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: రికీ భుయ్‌ (సి) వాట్సన్‌ (బి) చహర్‌ 0; విలియమ్సన్‌ (సి) జడేజా (బి) బ్రేవో 84; మనీశ్‌ పాండే (సి) కరణ్‌ శర్మ (బి) చహర్‌ 0; హుడా (సి) జడేజా (బి) చహర్‌ 1; షకీబ్‌ (సి) రైనా (బి) కరణ్‌ శర్మ 24; యూసుఫ్‌ పఠాన్‌ (సి) రైనా (బి) ఠాకూర్‌ 45; సాహా నాటౌట్‌ 5; రషీద్‌ ఖాన్‌ నాటౌట్‌ 17 ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1–0, 2–10, 3–22, 4–71, 5–150, 6–157.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–1–15–3, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–45–1, వాట్సన్‌ 2–0–23–0, రవీంద్ర జడేజా 4–0–28–0, కరణ్‌ శర్మ 3–0–30–1, బ్రేవో 3–0–37–1.

ముందుండి నడిపించి...
రాయుడు... రాయుడు... ఆదివారం ఉప్పల్‌ స్టేడియం ఈ పేరుతో మార్మోగిపోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు గెలవాలని కోరుకుంటూ వచ్చిన ఫ్యాన్స్‌ కూడా అంతే అభిమానంతో తమవాడిగా భావించి స్టేడియంలో ప్రతీ బంతికి తనను ప్రోత్సహిస్తుంటే రాయుడు ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రత్యేక ఇన్నింగ్స్‌ ఆడాడు. బహుశా అతనికి కూడా మొదటిసారి సొంత మైదానంలో ఆడుతున్న అనుభూతి కలిగినట్లుంది. ఎందుకంటే అతను ఐపీఎల్‌ ప్రారంభమయ్యాక దేశవాళీ క్రికెట్‌లో తొలిసారి ఇటీవలే హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ఆ తర్వాత వచ్చిన ఐపీఎల్‌ ఇదే. అంబటి రాయుడు 2010 నుంచి 2017 వరకు ఎనిమిది సీజన్ల పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడు. ఇన్నేళ్ళలో అతను బరోడాకు చెందిన ఆటగాడిగానే గుర్తింపు పొందాడు. ఒక సీజన్‌ విదర్భకు ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇదే మైదానంలో 2017 ఫైనల్లో పుణే 4 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితిలో డీప్‌ కవర్‌లో స్మిత్‌ క్యాచ్‌ను అద్భుతంగా అందుకొని గర్జించిన రాయుడు అదే వేదికపై తన తర్వాతి మ్యాచ్‌లో మరో జట్టు తరఫున బ్యాటింగ్‌తో చెలరేగాడు. 

గతంలో సన్‌రైజర్స్‌పై హైదరాబాద్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో రాయుడు 34, 68, 54 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ పరిస్థితి వేరు. మరొకరికి సహాయపాత్రలో కాకుండా తాను ముందుండి దూకుడుగా నడిపించిన తీరు చూస్తే ఈ ఇన్నింగ్స్‌ విశేషమైనదే. చెన్నై స్కోరు 2 వికెట్లకు 32 వద్ద రాయుడు క్రీజ్‌లోకి వచ్చాడు. రెండో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను, భువనేశ్వర్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ బాదాడు. ఇదే సూపర్‌కింగ్స్‌ జోరుకు బీజం వేసింది. ముఖ్యంగా స్టాన్‌లేక్‌ వేసిన ఓవర్లో అతను రౌద్ర రూపం చూపించాడు. మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో ప్రత్యర్థి పనిపట్టాడు. ఈ మ్యాచ్‌లో రాయుడు ఆడిన ప్రతీ షాట్‌లో అమితమైన ఆత్మవిశ్వాసం కనిపించింది. ఏ దశలోనూ, ముఖ్యంగా రివర్స్‌ స్వీప్‌ ఆడేటప్పుడు కూడా అతను తడబాటుకు గురి కాలేదు.

ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X పంజాబ్‌
వేదిక: ఢిల్లీ, రా.గం. 8 నుంచిస్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

మరిన్ని వార్తలు