దినేశ్‌ కార్తీక్‌కు ఎక‍్కువ చాన్స్‌లు ఇచ్చినా..

10 Nov, 2018 11:21 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం కేవలం యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌కే ఉందని భారత మాజీ వికెట్‌ కీపర్‌ విజయ్‌ దహియా అన్నాడు. 2014లో ధోని తన టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టెస్టుల్లో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం సెలక్టర్లు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో వృద్ధిమాన్‌ సాహా, పార్దీవ్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌లకు సెలక్టర్లు చాలా అవకాశాలు ఇచ్చి చూశారు. కానీ వారిలో ఏ ఒక్కరూ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయారని దహియా అన్నాడు. ఈ క్రమంలో ధోనికి ప్రత్యామ్నాయంగా దొరికిన ఆటగాడు రిషబ్‌ పంతేనని అన్నాడు. ఆదిలోనే అతనికి వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడన్నాడు.

‘ప్రధానంగా టెస్టుల్లో ధోనికి ప్రత్యామ్నయం కోసం టీమిండియా మేనేజ్‌మెంట్‌ చాలా ప‍్రయోగాలు చేసింది. పార్దీవ్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌లను పరీక్షించింది. ఇక్కడ పార్దీవ్‌ పటేల్‌కు కొన్ని అవకాశాలు మాత్రమే  వస్తే, దినేశ్‌ కార్తీక్‌కు ఎక్కువ చాన్స్‌లు ఇచ్చినా దాన్ని వినియోగించుకోవడం విఫలమయ్యాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టుకు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయగల సత్తా ఉన్న వికెట్‌కీపర్‌ కావాలి.  సాహాకు కూడా జట్టులో చోటు దక్కినా.. అతను గాయాల కారణంగా తనని తాను నిరూపించుకోలేకపోతున్నాడు. కానీ రిషబ్‌ పంత్‌ మాత్రం తొలి టెస్టులోనే అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అతనిలో మ్యాచ్‌ గెలిపించే సత్తా ఉంది’ అని విజయ్‌ దహియా అన్నాడు. ఇటీవల ఇంగ్లడ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన రిషబ్‌ పంత్‌.. ఇప్పటివరకూ ఐదు టెస్టులాడి 346పరుగులు సాధించాడు. అందులో ఒక శతకం, రెండు అర్ధశతకాలున్నాయి.

>
మరిన్ని వార్తలు