42 ఫోర్లు.. 9 సిక్సర్లు!

16 Oct, 2016 17:33 IST|Sakshi
42 ఫోర్లు.. 9 సిక్సర్లు!

ముంబై: దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో భాగంగా ఇక్కడ మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్లో మరో సంచలన ఇన్నింగ్స్ నమోదైంది. ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్  (308: 326 బంతుల్లో 42 ఫోర్లు, 9 సిక్సర్లు) విజృంభించి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఐదో స్థానంలో  బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ రెచ్చిపోయాడు. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటునే, చెత్త బంతులను మాత్రం బౌండరీలు దాటించాడు.

 

కాగా, అంతకుముందు ఇదే మ్యాచ్ లో మహారాష్ట్ర ఆటగాళ్లు స్వప్నిల్ గుగలే(351నాటౌట్), అంకిత్ బావ్నే(258నాటౌట్) మూడో వికెట్‌కు అభేద్యంగా 594 పరుగులు జోడించి దేశవాళీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. తద్వారా తొలిసారి  ఒకే రంజీ మ్యాచ్ లోముగ్గురు 250కు పైగా వ్యక్తిగత పరుగులను నమోదు చేసిన మరో రికార్డు లిఖించబడింది.

చివరిరోజు ఆటలో భాగంగా 155 పరుగులతో ఓవర్ నైట్ బ్యాట్స్మన్ గా  క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ దూకుడుగా ఆడి ట్రిపుల్ ను సాధించాడు. ఈ క్రమంలోనే రెండొందలకు పైగా పరుగులను ఫోర్లు, సిక్సర్లతోనే సాధించి ఢిల్లీని పటిష్ట స్థితికి తీసుకెళ్లాడు. దాంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ లో 590 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ను 635/2 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఇన్నింగ్స్ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మహారాష్ట్ర ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మరిన్ని వార్తలు