రాస్‌ టేలర్‌కు ‘టాప్‌’ అవార్డు

1 May, 2020 10:09 IST|Sakshi

మూడోసారి రిచర్డ్‌ హ్యాడ్లీ పురస్కారం

2023 వరల్డ్‌కప్‌ ఆడటమే లక్ష్యం

వయసు అనేది నంబర్‌  మాత్రమే

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ సీనియర్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్‌ పురస్కారం లభించింది. న్యూజిలాండ్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ అవార్డు టేలర్‌ను వరించింది. కరోనా వైరస్‌ కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన వర్చువల్‌ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఫలితంగా మూడోసారి రిచర్డ్‌ హ్యాడ్లీ అవార్డును టేలర్‌ గెలుచుకున్నాడు. వరుస రెండు వన్డే వరల్డ్‌కప్‌లో కివీస్‌ ఫైనల్‌కు చేరడంలో భాగస్వామ్యమైన టేలర్‌.. గత ఏడాది కాలంలో న్యూజిలాండ్‌ తరఫున అత్యంత  విజయవంతమైన టెస్టు ఆటగాడిగా నిలిచాడు. మరొకవైపు మూడు ఫార్మాట్లలో వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కూడా టేలర్‌ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. తాజా అవార్డుపై టేలర్‌ స్పందిస్తూ.. ‘ గడిచిన ఏడాది నా కెరీర్‌లో అద్భుతమైనదిగా నిలిచింది. ఎన్నో ఎత్తు-పల్లాలతో  నా కెరీర్‌ ఇంకా సాగుతుండటం ఆనందంగా ఉంది. (ఆ టీషర్ట్‌ను యునిసెఫ్‌కు విరాళంగా ఇస్తా)

2023లో భారత్‌లో జరుగనున్న వన్డే  వరల్డ్‌కప్‌లో ఆడటమే నా ముందున్న లక్ష్యం.  వరుసగా రెండు వరల్డ్‌కప్‌ల్లో మా జట్టు ఫైనల్‌ చేరడంలో భాగస్వామ్యం అయ్యా. ఇక వరుసగా మూడోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా. పరుగులు చేయాలనే దాహం. మానసికంగా ధృడంగా ఉండటమే నా సానుకూలాంశం. వయసు అనేది ప్రామాణికం కాదు. అది కేవలం నంబర్‌ మాత్రమే. నాకు కివీస్‌ తరుఫున ఇంకా ఆడాలని ఉంది’ అని 36 ఏళ్ల టేలర్‌ పేర్కొన్నాడు. 2006లో కివీస్‌ తరఫున అరంగేట్రం  చేసిన టేలర్‌.. 101 టెస్టులు, 232 వన్డేలు ఆడాడు.ఇక 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా వంద టెస్టుల మార్కును చేరాడు టేలర్‌. దాంతో ఏ జట్టు తరఫున చూసినా మూడు ఫార్మాట్లలో కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో కివీస​ తరఫున వంద టెస్టులు ఆడిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. డానియల్‌ వెటోరి(112), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(111), బ్రెండన్‌ మెకల్లమ్‌(101)లు టేలర్‌ కంటే ముందు వంద టెస్టులు ఆడిన కివీస్‌ ఆటగాళ్లు.(మూడేళ్లలో 217 సిక్సర్లు.. అందుకే కదా అలా అనేది!)

మరిన్ని వార్తలు