మహీ కెప్టెన్ పదవి.. మాస్టర్ చలవే

10 Nov, 2013 13:33 IST|Sakshi
మహీ కెప్టెన్ పదవి.. మాస్టర్ చలవే

ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ కెప్టెన్లలో ఒకడిగా మహేంద్ర సింగ్ ధోనీ పేరు సంపాదించి ఉండొచ్చు. అతనిలో నాయకత్వ లక్షణాలను తొలుత గుర్తించింది మాత్రం సచిన్ టెండూల్కర్. టీమిండియా కెప్టెన్ పదవికి ధోనీ పేరును మొదట ప్రతిపాదించి కూడా సచినే. 2007లో రాహుల్ ద్రావిడ్ వైదొలిగినపుడు అతని స్థానంలో ధోనీని ఎంపిక చేస్తే అత్యుత్తమ సారథి అవుతాడని సచిన్ మద్దతు పలికాడు. తనకు అవకాశం వచ్చినా కాదనుకుని సచిన్ ధోనీకి మద్దతు పలికాడు. ఈ విషయాల్ని ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్ వెల్లడించాడు. ఆ సమయంలో పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు.

'కొన్నేళ్ల క్రితం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న నేనూ లండన్లో ఉన్నాను. ఓ రోజు ద్రావిడ్ నా వద్దకు వచ్చి కెప్టెన్గా వైదొలగాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అతని నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కెప్టెన్ పదవికి సచిన్ పేరును ద్రావిడ్ ప్రతిపాదించాడు. ఈ విషయం గురించి సచిన్తో నేను మాట్లాడాను. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సచిన్ అంగీకరించలేదు. తన బదులు ధోనీని ఎంపిక చేయాలని సూచించాడు. కెప్టెన్గా ధోనీ సమర్థవంతంగా పనిచేయగలడా అని సందేహం వ్యక్తం చేశాను. అవకాశమిస్తే మహీ అత్యుత్తమ కెప్టెన్ కాగలడని సచిన్ నన్ను ఒప్పించాడు. అనంతరం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ధోనీని కెప్టెన్గా ఎంపిక చేసింది. దేశం గర్వించగల కెప్టెన్గా మహీ నిరూపించుకున్నాడు' అని పవార్ తెలిపారు. సచిన్ ఎప్పుడూ సహచరులకు, ముఖ్యంగా జూనియర్లకు అండగా ఉంటాడని పవార్ తన బ్లాగ్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు