పిక్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్

27 Aug, 2014 00:13 IST|Sakshi
పిక్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్

రెండో రౌండ్‌లో శ్రీకాంత్, జైరాం
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్

 
కోపెన్‌హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో ‘బై’ లభించిన సైనా... మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో సునాయాస విజయం సాధించింది. ఏడో సీడ్ సైనా 21-11, 21-9 తేడాతో రష్యాకు చెందిన నటాలియా పెర్మినోవాను చిత్తు చేసింది. 31 నిమిషాల్లోనే భారత నంబర్‌వన్ ప్లేయర్ ఈ మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 11-21, 21-12 స్కోరుతో ఇజ్‌టోక్ ఉట్రోసా (స్లొవేకియా)ను ఓడించాడు. మరో భారత ఆటగాడు అజయ్ జైరాంకు ‘వాకోవర్’ రూపంలో అదృష్టం కలిసొచ్చింది.
 
తొలి రౌండ్‌లో అతను నాలుగో సీడ్ కెనిచి టాగో (జపాన్)తో తలపడాల్సి ఉండగా...చివరి నిమిషంలో కెనిచి తప్పుకోవడంతో అజయ్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన ప్రజక్తా సావంత్-ఆరతి సారా సునీల్ జోడి ప్రత్యర్థికి ‘వాకోవర్’ ఇచ్చింది. ఫలితంగా పుతీతా సుప్రజిరకుల్- సప్సిరీ (థాయిలాండ్) జంట రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. మరో వైపు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత జోడి అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఆరో సీడ్ మైకేల్ ఫక్స్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) 21-14, 21-11 తో అరుణ్-అపర్ణలపై గెలుపొందింది.
 
కశ్యప్ నిష్ర్కమణ
కామన్వెల్త్‌లో స్వర్ణం నెగ్గి ఉత్సాహం మీదున్న పారుపల్లి కశ్యప్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 24-26, 21-13, 18-21తో డీటర్ డోమ్కీ (జర్మనీ) చేతిలో పరాజయం పాలయ్యాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా