లంకను ఆడుకున్నారు!

13 Nov, 2017 03:31 IST|Sakshi

బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ 287/5

సంజు శామ్సన్‌ సెంచరీ

రెండు రోజుల మ్యాచ్‌ డ్రా

కోల్‌కతా: శ్రీలంక క్రికెట్‌ జట్టుకు భారత గడ్డపై రాబోయే ‘సీన్‌’ అర్థమైంది. భారత ‘తృతీయ శ్రేణి’ జట్టు బ్యాట్స్‌మెన్‌ కూడా లంక బౌలర్లను అలవోకగా ఆడుకున్నారు. ఏమాత్రం పదును లేని లంకను ఎదుర్కొని బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజు శామ్సన్‌ (143 బంతుల్లో 128; 19 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగగా... రోహన్‌ ప్రేమ్‌ (39; 5 ఫోర్లు), జీవన్‌జ్యోత్‌ సింగ్‌ (35; 3 ఫోర్లు), బావనక సందీప్‌ (33 నాటౌట్‌; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరిగిన ఈ రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆదివారం ‘డ్రా’గా ముగిసింది.
 
ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే తిరిమన్నె వరుస ఓవర్లలో తన్మయ్‌ అగర్వాల్‌ (16; 3 ఫోర్లు), ఆకాశ్‌ భండారి (3)లను అవుట్‌ చేసి లంకకు శుభారంభం అందించాడు. అయితే శామ్సన్, జీవన్‌జ్యోత్‌ లంక రెగ్యులర్‌ బౌలర్లు హెరాత్, దిల్‌రువాన్‌ పెరీరా, లక్మల్‌లను సమర్థంగా ఎదుర్కొని మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఆ తర్వాత కూడా శామ్సన్‌... రోహన్‌ ప్రేమ్‌తో 71 పరుగులు, సందీప్‌తో 85 పరుగులు జత చేశాడు. చివరకు 75 ఓవర్ల తర్వాత మ్యాచ్‌ను నిలిపివేసేందుకు ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించారు. జట్టు సభ్యులందరికీ ప్రాక్టీస్‌ ఆశించిన శ్రీలంక ఏకంగా 14 మందితో బౌలింగ్‌ చేయించడం విశేషం. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 16 నుంచి ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగుతుంది.  

స్కోరు వివరాలు  
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: 411/9 డిక్లేర్డ్‌; బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (ఎల్బీ) (బి) తిరిమన్నె 16; జీవన్‌జ్యోత్‌ సింగ్‌ (సి) డిక్‌వెలా (బి) పెరీరా 35; ఆకాశ్‌ భండారి (సి) షనక (బి) తిరిమన్నె 3; శామ్సన్‌ (సి) డిక్‌వెలా (బి) సమరవిక్రమ 128; ప్రేమ్‌ (ఎల్బీ) (బి) డి సిల్వ 39; సందీప్‌ (నాటౌట్‌) 33; జలజ్‌ సక్సేనా (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (75 ఓవర్లలో 5 వికెట్లకు) 287.  

వికెట్ల పతనం: 1–27; 2–31; 3–99; 4–170; 5–255.

బౌలింగ్‌: కరుణరత్నే 4–2–7–0; తిరిమన్నె 6–0–22–2; మాథ్యూస్‌ 5–2–21–0; షనక 8–0–36–0; హెరాత్‌ 6–0–15–0; కుషాల్‌ పెరీరా 9–1–22–1; లక్మల్‌ 4–1–11–0; గమగే 5–1–19–0; సందకన్‌ 12–1–54–0; ధనంజయ డి సిల్వా 7–1–35–1; విశ్వ ఫెర్నాండో 1–0–16–0; సమరవిక్రమ 4–0–13–1; రోషన్‌ సిల్వ 3–1–3–0; చండిమాల్‌ 1–0–3–0. 

మరిన్ని వార్తలు