ఆ కొంత మందిని పట్టించుకోను!

16 Sep, 2015 00:13 IST|Sakshi
ఆ కొంత మందిని పట్టించుకోను!

విమర్శకులకంటే  నాకు అభిమానుల సంఖ్యే ఎక్కువ
నా ధ్యాసంతా ఆటపైనే
మీడియాతో సానియా మీర్జా

 
 తన కెరీర్‌లో వివాదాలు కొత్త కాదని, అయితే తరచుగా విమర్శించే కొంత మందిని లెక్క చేయనని ప్రపంచ నంబర్‌వన్ డబుల్స్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యాఖ్యానించింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన అనంతరం సానియా మంగళవారం తెల్లవారుజామున స్వస్థలం హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఈ ఏడాది తనకు అద్భుతంగా కలిసొచ్చిందని, అయితే మరికొన్ని టైటిల్స్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సానియా చెప్పింది. హైదరాబాద్ చేరుకున్న అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ సానియా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే...
 
 యూఎస్ ఓపెన్ విజయంపై...
 ప్రతీ గ్రాండ్‌స్లామ్ విజయం ప్రత్యేకమైనదే. అయితే నాకు హార్డ్ కోర్ట్‌లంటే ఇష్టం. అలాంటి వేదికపై టైటిల్ సాధించడం ప్రత్యేకం. ఇతర టోర్నీలతో పోలిస్తే అమెరికాలో భారత అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. సింగిల్స్‌లో నా అత్యుత్తమ ప్రదర్శన ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది కూడా ఇక్కడే. కాబట్టి యూఎస్ ఓపెన్ రెట్టింపు ఆనందాన్నిచ్చింది. నాకు మద్దతు ఇచ్చిన భారతీయులందరికీ ఈ విజయం అంకితం.

 హింగిస్‌తో భాగస్వామ్యం...
 ప్రతీ మ్యాచ్‌కు మేం మెరుగవుతూ ఉన్నాం. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. క్వార్టర్‌ఫైనల్ తొలి సెట్‌లో 0-5 నుంచి కోలుకున్నాం అంటే ఎంత బాగా ఆడామో అర్థం చేసుకోవచ్చు. జంటగా మేమిద్దరం ఇప్పటికే నంబర్‌వన్ అయినా మరికొన్ని చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది కూడా మేమిద్దరం కలిసే ఆడతాం. మిక్స్‌డ్‌లో మాత్రం బ్రూనో సోరెస్‌తో కొనసాగుతానో, లేదో చెప్పలేను.

 ‘ఖేల్ రత్న ’ వివాదంపై...
 నా గురించి ఎన్నో అర్థం లేని అంశాల గురించి రాసి, చూపించిన మీడియాకు నా కెరీర్‌లో ఆ రకంగా నేను చాలా సహాయం చేశాను! నాకు కూడా వారు అనవసర ప్రచారం కల్పించినందుకు సంతోషం. అయినా నేను పత్రికలు పెద్దగా చదవను. నేను నా కోసం, నా దేశం కోసం టెన్నిస్ ఆడతాను. నేను ఎంచుకున్న రంగంలో విజయం కోసం కష్టపడతాను. నా ఆటతోనే ఎవరికైనా సమాధానం చెబుతా. కాబట్టి కొంత మంది తరచుగా చేసే విమర్శలను పట్టించుకోను. వారిని మినహాయిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు నన్ను ప్రేమిస్తున్నారనేది నాకు తెలుసు.

 ‘రియో’ ఒలింపిక్స్‌పై...
 ఒలింపిక్స్‌లో వాస్తవంగా ఆలోచిస్తే మనకు మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకం గెల్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే దానికి ఏడాది సమయం ఉంది. రియోలో ఆడేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొంత సమయం తర్వాతే దానిపై స్పష్టత వస్తుంది. కాబట్టి ఇప్పుడే ఆలోచించడం లేదు.

 డబ్ల్యూటీఏ ఫైనల్స్‌పై...
 డిఫెండింగ్ చాంపియన్‌గా దానిని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాను. ఈసారి కారా బ్లాక్ స్థానంలో హింగిస్ వచ్చింది. అయితే దానికి ముందు బీజింగ్, షాంఘై, గ్వాంగ్జూ టోర్నీలలో విజయం సాధించాల్సి ఉంది. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఈ సీజన్‌ను నా కెరీర్‌లోనే అత్యుత్తమంగా చెప్పగలను. సాధ్యమైనంత కాలం నంబర్‌వన్‌గా ఉండాలని కూడా కోరుకుంటున్నా.
 
 ‘బీబీసీ’ సానియాను మళ్లీ మర్చిపోయింది!
 ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ ‘బీబీసీ’కు టెన్నిస్ మహిళల డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ఎవరో తెలియకుండా పోదు. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్‌లు గెలవక ముందే సానియా మీర్జా నంబర్‌వన్ అయింది. అయితే ఈ రెండు టోర్నీలు గెలిచిన సమయంలో ఆ చానల్‌కు చెందిన న్యూస్, స్పోర్ట్స్ ట్విట్టర్ అకౌంట్‌లలో కనీసం సానియా పేరు కూడా ప్రస్తావించలేదు. యూఎస్ ఓపెన్ నెగ్గిన హింగిస్... హింగిస్ మళ్లీ సాధించింది... ఇలా సాగాయి ఆ చానల్ హెడింగ్స్! ట్రోఫీని ఇద్దరూ ముద్దాడుతున్న ఫొటో పెట్టి కూడా దాని కింద హింగిస్ పేరు మాత్రమే రాసింది. దీనిపై సోషల్ మీడియాలో భారతీయులు విరుచుకుపడ్డారు.

ఇది పొరపాటుగా జరిగిందా లేక కావాలనే శ్వేత జాతీయేతర క్రీడాకారిణిపై ఇంకా వివక్ష కొనసాగుతోందా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ‘హింగిస్ ఒక్కతే డబుల్స్ గెలిచిందా’... ‘డబుల్స్ అంటే ఇద్దరు ఆడతారనే విషయం కూడా చెప్పాలా’... ‘హింగిస్ రెండు చేతుల్లో రెండు రాకెట్లతో ఆడిందా’... ‘ప్రపంచంలో ఒంటరిగా డబుల్స్ టైటిల్ నెగ్గిన ఏకైక క్రీడాకారిణి హింగిస్’... ఇలా ట్వీట్లతో అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వింబుల్డన్ గెలిచినప్పుడు కూడా బీబీసీ ఇలాగే రాస్తే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘సానియా కూడా’... అంటూ విమర్శించింది. దాంతో క్షమాపణ చెబుతూ ట్వీట్ మార్చిన బ్రిటన్ న్యూస్ ఏజెన్సీ ఇప్పుడు మళ్లీ సానియాను మర్చిపోయింది.

మరిన్ని వార్తలు