-

సరిగ్గా ఏడాది క్రితం.. వరల్డ్‌కప్‌లో

22 Jun, 2020 17:20 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలై ఇంటిదారి పట్టింది. లీగ్‌ దశలో ఒక్క ఓటమి మినహా మిగతా మ్యాచ్‌లు అన్ని గెలిచి సత్తా చాటిని విరాట్‌ గ్యాంగ్‌.. అసలు సిసలు సమరంలో మాత్రం పూర్తి స్థాయిలో ఆడలేకపోయింది. కాగా, సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు(జూన్‌ 22వ తేదీన) భారత పేసర్‌ మహ్మద్‌ పేసర్‌ రికార్డు నమోదు చేశాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించి అరుదైన జాబితాలో చేరిపోయాడు. 11 పరుగుల తేడాతో భారత్‌ గెలిచిన ఆ మ్యాచ్‌లో షమీ కీలక పాత్ర పోషించాడు.(‘మోరే క్యాచ్‌ వదిలేస్తే.. గూచ్‌ ట్రిపుల్‌ సెంచరీ కొట్టాడు’)

225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన అఫ్తాన్‌కు ఆరంభం బాగానే ఉన్నప‍్పటికీ మిడిల్‌ ఓవర్లలో మాత్రం వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. ప్రధానంగా షమీ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అఫ్గాన్‌ మూడు వికెట్లను వరుసగా కోల్పోయింది. ఆఖరి ఓవర్‌ను అందుకున్న షమీ వేసిన తొలి బంతిని నబీ బౌండరీ కొట్టగా, మూడో బంతికి హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఆపై వేసిన రెండు బంతుల​కు అఫ్తాబ్‌ అలామ్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌లు ఔట్‌ కావడంతో షమీకి హ్యాట్రిక్‌ లభించింది. దాంతో భారత్‌ ఇంకా బంతి ఉండగానే గెలిచింది. కాగా, ఒక వరల్డ్‌కప్‌లో  హ్యాట్రిక్‌ సాధించిన రెండో టీమిండియా బౌలర్‌గా షమీ రికార్డు సాధించాడు. అంతకుముందు చేతన్‌ శర్మ హ్యాట్రిక్‌ తీశాడు. 1987 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై చేతన్‌ శర్మ హ్యాట్రిక్‌ తీయగా, అతని సరసన షమీ నిలిచాడు. అది జరిగి ఏడాది కావడంతో దానిని క్రికెట్‌ అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు