శివపాల్‌ సింగ్‌ విఫలం

6 Oct, 2019 03:38 IST|Sakshi

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

దోహా: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల వైఫల్యం కొనసాగుతోంది. పురుషుల జావెలిన్‌ త్రో విభాగంలో భారత ఆటగాడు శివపాల్‌ సింగ్‌ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. శివపాల్‌ సింగ్‌ ఈటెను 78.97 మీటర్ల దూరం విసిరి గ్రూప్‌ ‘ఎ’లో పదో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 30 మంది బరిలోకి దిగగా... శివపాల్‌ సింగ్‌ 24వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. టాప్‌–12లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొహనెస్‌ వెటెర్‌ (జర్మనీ–89.35 మీటర్లు) క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించాడు.  పురుషుల 20 కిలోమీటర్ల నడక ఫైనల్లో భారత అథ్లెట్‌ ఇర్ఫాన్‌ గంటా 35 నిమిషాల 21 సెకన్లలో గమ్యానికి చేరి 36వ స్థానంలో నిలిచాడు.

తొషికాజు (జపాన్‌–1గం:26ని.34 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో దలీలా (అమెరికా–52.16 సెకన్లు) కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచింది. పురుషుల హైజంప్‌లో ముతాజ్‌ ఇసా బర్షిమ్‌ (ఖతర్‌–2.37 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మహిళల డిస్కస్‌ త్రోలో వైమి పెరెజ్‌ (క్యూబా–69.17 మీటర్లు) పసిడి పతకం సొంతం చేసుకుంది. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో స్టీవెన్‌ గార్డ్‌నర్‌ (బహమాస్‌–43.48 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు.

>
మరిన్ని వార్తలు