సింధుకు చుక్కెదురు

17 Oct, 2018 01:26 IST|Sakshi

రెండో ఏడాదీ డెన్మార్క్‌ ఓపెన్‌  తొలి రౌండ్‌లోనే ఓడిన భారత స్టార్‌

రెండు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని గెలిచిన సైనా నెహ్వాల్‌  

ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యుకిపై సమీర్‌ వర్మ గెలుపు

ఓడెన్స్‌: కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తూ... పలు టోర్నీలలో ఫైనల్‌కు చేరుకొని తుది పోరులో తడబడుతోన్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు డెన్మార్క్‌ ఓపెన్‌లో మాత్రం నిరాశ ఎదురైంది. చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌ పోరాట పటిమ ముందు సింధు చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 17–21, 21–16, 18–21తో ప్రపంచ పదో ర్యాంకర్‌ బీవెన్‌ జాంగ్‌ చేతిలో ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో చెరో గేమ్‌ గెలిచాక... నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు రెండుసార్లు 13–12తో... 15–13తో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే బీవెన్‌ జాంగ్‌ వెంటనే తేరుకొని వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–15తో ముందంజ వేసింది. అదే జోరులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. బీవెన్‌ జాంగ్‌ చేతిలో సింధు ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఇండియా ఓపెన్‌ ఫైనల్లో, 2017 ఇండోనేసియా ఓపెన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనూ బీవెన్‌ జాంగ్‌ చేతిలో సింధుకు పరాజయం ఎదురైంది. వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ తొలి రౌండ్‌లో బీవెన్‌ జాంగ్‌తోనే సింధు తలపడనుంది. గతేడాది అక్టోబరు 18న డెన్మార్క్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో చెన్‌ యుఫె (చైనా) చేతిలో ఓడిపోయాక ఈ హైదరాబాద్‌ అమ్మాయికి మళ్లీ డెన్మార్క్‌ ఓపెన్‌లోనే తొలి రౌండ్‌లో ఓటమి ఎదురైంది. అయితే ఈ ఏడాది కాలంలో సింధు హాంకాంగ్‌ ఓపెన్, వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్, థాయ్‌లాండ్‌ ఓపెన్, కామన్వెల్త్‌ గేమ్స్, ఇండియా ఓపెన్‌లలో ఫైనల్లోకి చేరి రన్నరప్‌గా నిలిచింది.  

మరోవైపు మాజీ నంబర్‌వన్‌ సైనా నెహ్వాల్‌ హోరాహోరీ పోరులో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ప్రపంచ 24వ ర్యాంకర్‌ యి ఎన్గాన్‌ చెయుంగ్‌ (హాంకాంగ్‌)తో 81 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సైనా 20–22, 21–17, 24–22తో విజయం సాధించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 20–21తో, 21–22తో రెండుసార్లు పరాజయం అంచున నిలిచింది. అయితే కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా పాయింట్లు సాధించి గట్టెక్కింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో సైనా తలపడుతుంది.    

సమీర్‌ సంచలనం 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో సమీర్‌ వర్మ సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ షు యుకి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ సమీర్‌ వర్మ 21–17, 21–18తో గెలుపొందాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మను అత్రి 23–25, 21–18, 16–21తో కిమ్‌ యాస్‌ట్రప్‌–ఆండెర్స్‌ (డెన్మార్క్‌) చేతిలో... మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌–అశ్విని పొన్నప్ప 17–21, 18–21తో సియో సెయుంగ్‌ జే–కాంగ్‌ హీ యోంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ భార‌త క్రికెట‌ర్ రియ‌ల్ హీరో: ఐసీసీ

దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు... 

ఆటగాళ్లూ... మీ స్థానాలు భద్రం 

భారత షాట్‌పుట్‌ క్రీడాకారుడిపై నాలుగేళ్ల నిషేధం 

ధోని కోరిక తీరకపోవచ్చు! 

సినిమా

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...

కష్టాల్లో సినీ కార్మికులు : అండగా నిలిచిన మాస్‌ మహారాజా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌