పాండ్యా, రాహుల్‌లను వెనకేసుకొచ్చిన సౌరవ్‌

17 Jan, 2019 08:58 IST|Sakshi

ముంబై : ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌లను టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ వెనకేసుకొచ్చాడు. తప్పుగా మాట్లాడి కుమిలిపోతున్న పాండ్యా, రాహుల్‌లను మన్నించి వదిలేయాలని అన్నారు. ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజమే..! పాండ్యా​, రాహుల్‌ మాటలు అభ్యతంరకరమైనవే. వారు మాట్లాడింది తప్పే. కానీ, మనమంతా మనుషులం. మెషీన్లం కాదు. మెషీన్‌ మాదిరిగా మనం ముందుగానే ఫిక్స్‌ చేసినట్టుగా అన్నీ పర్‌ఫెక్ట్‌గా జరగాలని లేదు. తీవ్ర విమర్శలతో వారిని మరింత బాధించొద్దు. చేసిన తప్పును తెలుసుకుని వారు కుమిలిపోతున్నారు. మళ్లీ అలాంటి తప్పు చేయరు. వారికొక అవకాశమిద్దాం. వారిపై విమర్శలతో ఇంకా రాద్ధాంతం చేయొద్దు.  మనం బతుకుదాం. ఇతరులను బతకనిద్దాం’ అని వ్యాఖ్యానించారు. (విచారణ మొదలు)

కాగా, మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ తీవ్ర వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు బీసీసీఐ వారిని జట్టు నుంచి తప్పించింది. అర్ధాంతరంగా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు రప్పించింది. పాండ్యా, రాహుల్‌ల విచారణ మొదలైంది. బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి మంగళవారం వారితో ఫోన్‌లో మాట్లాడారు. అయితే కేవలం క్రికెటర్లు చెప్పింది మాత్రమే ఆయన విన్నారని... టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యం, ఆ వ్యాఖ్యల గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదని సమాచారం. (కుమిలిపోతున్న పాండ్యా!)

మరిన్ని వార్తలు