తాహిర్ మాయాజాలం...

24 Oct, 2013 01:19 IST|Sakshi

దుబాయ్: బ్యాటింగ్‌లో నిలకడలేమితో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ జట్టు... దక్షిణాఫ్రికాతో బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో కుప్పకూలింది. ఇమ్రాన్ తాహిర్ (5/32) తన స్పిన్ మాయాజాలంతో మిస్బా సేన బ్యాటింగ్ ఆర్డర్‌ను పేకమేడలా కూల్చేశాడు.

దీంతో మొదటి రోజు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 36.4 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. జుల్ఫికర్ బాబర్ (25 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్లకు 128 పరుగులు చేసింది. స్మిత్ (67 బ్యాటింగ్), స్టెయిన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పీటర్సన్ (26), ఎల్గర్ (23), కలిస్ (7) విఫలమయ్యారు. అజ్మల్‌కు 2, బాబర్‌కు ఒక్క వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ప్రొటీస్ బౌలర్లు చుక్కలు చూపారు.
 
  ఆరంభం నుంచే స్టెయిన్ (3/38), ఫిలాండర్, మోర్కెల్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగారు. దీంతో ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ఖుర్రమ్ మన్‌జూర్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత షాన్ మసూద్ (21), అజహర్ అలీ (19) రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే నవంబర్ 2011 తర్వాత తొలి టెస్టు ఆడుతున్న తాహిర్... 11 బంతుల వ్యవధిలో మసూద్, మిస్బా (2), అద్నాన్ అక్మల్ (0)లను అవుట్ చేసి షాకిచ్చాడు. దీంతో లంచ్ విరామానికి పాక్ 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. చివర్లో బాబర్, జునైద్ ఖాన్ (4) ఆఖరి వికెట్‌కు 33 పరుగులు జోడించారు.
 

మరిన్ని వార్తలు