పతకానికి చేరువై.. అంతలోనే దూరమై..

8 May, 2020 03:35 IST|Sakshi
తన మైనపు బొమ్మతో మిల్కా

0.1 సెకన్‌ తేడాతో ఒలింపిక్‌ పతకాన్ని కోల్పోయిన మిల్కా సింగ్‌

1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో విషాదం

38 ఏళ్ల పాటు నిలిచిన జాతీయ రికార్డు  

రెప్పపాటులో... వెంట్రుకవాసి తేడాతో... అర క్షణంలో...ఈ మాటలు అప్పుడప్పుడు అలవోకగా మనం వాడేస్తుంటాం. కానీ వాస్తవంలో వచ్చే సరికి వీటి విలువ ఎంత? ఇదే ప్రశ్న మిల్కా సింగ్‌ను అడిగితే ‘జీవిత కాలమంత’ అనే సమాధానం వస్తుందేమో! ఎందుకంటే ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు చేరువై... అంతలోనే  దూరమైన విషాదానికి నిలువెత్తు నిదర్శనం మిల్కా సింగ్‌. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులో మిల్కా నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయిన క్షణాన్ని భారత అభిమానులు మరచిపోలేరు. ఆ తర్వాత ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనను బట్టి చూస్తే... పతకం దక్కకపోయినా నాటి ఘటనకు భారత క్రీడా చరిత్రలో ఉన్న ప్రాతినిధ్యం ఏమిటో అర్థమవుతుంది.  
                                                   

ఆ జ్ఞాపకాలన్నీ...
రోమ్‌ ఒలింపిక్స్‌కు ముందే మిల్కా సింగ్‌ భారత అథ్లెటిక్స్‌కు సంబంధించి తనదైన ప్రత్యేక ముద్ర వేశాడు. దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో కళ్ల ముందే తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు అనేక కష్టాలను ఎదుర్కొన్న మిల్కా ఎంతో పోరాటంతో వాటిని అధిగమించాడు. భారత సైన్యంలో చేరడంతో అతని జీవితానికి ఒక దిశ లభించింది. అక్కడే అథ్లెట్‌గా పాఠాలు నేర్చుకున్న అతను కొన్నాళ్లకు పూర్తి స్థాయిలో 400 మీటర్ల పోటీని తన ప్రధాన ఈవెంట్‌గా మార్చుకున్నాడు.

1958 కటక్‌ జాతీయ క్రీడల్లో 200 మీ., 400 మీ. విభాగాల్లో స్వర్ణాలతో వెలుగులోకి వచ్చిన మిల్కా... అదే ఏడాది టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో ఈ రెండు విభాగాల్లోనే స్వర్ణ పతకాలు గెలుచుకొని తన సత్తా చాటాడు. కొద్ది రోజులకే కార్డిఫ్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో కూడా 400 మీటర్ల పరుగు (440 గజాలు)లో అగ్ర స్థానంలో నిలవడంతో మిల్కా పేరు మారుమోగిపోయింది. దాంతో దేశవ్యాప్తంగా అతనికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఎక్కడకు వెళ్లినా మిల్కాకు జనం బ్రహ్మరథం పట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఒలింపిక్‌ వేదికకు వచ్చే సరికి అతను అంచనాలు అందుకోలేకపోయారు. ఫలితంగా 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో మిల్కా 200 మీ., 400 మీ. రెండింటిలో పాల్గొన్నా... హీట్స్‌ దశను దాటి ముందుకు వెళ్లలేకపోయాడు.  

గుండె పగిలిన క్షణం...
గత ఒలింపిక్స్‌ నుంచి పాఠాలు నేర్చుకున్న మిల్కా నాలుగేళ్ల పాటు తీవ్రంగా శ్రమించాడు. మెల్‌బోర్న్‌లో 400 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన చార్లెస్‌ జెన్‌కిన్స్‌ను కలిసి తన గురించి చెప్పుకున్నాడు. అతని నుంచి ప్రాక్టీస్‌కు సంబంధించి కొత్త తరహా టెక్నిక్‌లు, శిక్షణలో పద్ధతుల గురించి తెలుసుకున్నాడు. దాంతో 1960 రోమ్‌లో పోటీలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమై వచ్చాడు. ఒలింపిక్స్‌కు ముందు సన్నాహకంగా జరిగే రేసులలో అతను అద్భుతమైన టైమింగ్‌లు నమోదు చేయడంతో మళ్లీ అందరి దృష్టి మిల్కాపై పడింది. హీట్స్‌లో, క్వార్టర్‌ ఫైనల్లో, సెమీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శనతో మిల్కా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.  

 గన్‌ పేలింది... పరుగు ప్రారంభమైంది. ఐదో లేన్‌లో ఉన్న మిల్కా వేగంగా దూసుకుపోయాడు. ఒటిస్‌ డేవిస్‌ తర్వాత రెండో స్థానంలో అతను కొనసాగుతున్నాడు. 100 మీ., 200 మీ., 250 మీటర్లు ముగిశాయి. మిల్కాకు మంచి అవకాశం కనిపించింది. అంతలో అనూహ్యం జరిగింది! తన పోటీదారులు ఎక్కడ ఉన్నారో అన్నట్లుగా పరుగెడుతూనే లిప్తకాలం పాటు అతని దృష్టి పక్కకు పడింది. అంతే... ఆ అర క్షణంలోనే వేగం మందగించింది. ఈ చిన్న పొరపాటు మిల్కాసింగ్‌కు జీవిత కాలం బాధను మిగిల్చింది. అప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఇద్దరు అథ్లెట్లు దూసుకుపోయారు. కోలుకొని శక్తిమేరా పరుగెత్తేలోపే రేసు ముగిసిపోయింది. ఫలితంగా నాలుగో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఒటిస్‌ డేవిస్‌ (అమెరికా –44.9 సె.), కార్ల్‌ కాఫ్‌ మన్‌ (జర్మనీ– 44.9 సె.) తొలి రెండు స్థానాల్లో నిలవగా... కాంస్యం సాధించిన మాల్కమ్‌ స్పెన్స్‌ (దక్షిణాఫ్రికా – 45.5 సె.)కు మిల్కా సింగ్‌ (45.6 సె.) మధ్య తేడా చూస్తే ఆ బాధ ఏమిటో అర్థమవుతుంది.  

38 ఏళ్ల పాటు...
‘అధికారికంగా ఫలితాలు ప్రకటించక ముందే నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైపోయింది. 250 మీటర్లు అద్భుతంగా పరుగెత్తిన తర్వాత నెమ్మదించడం నాకు చేటు చేసింది. నేను ఆ వ్యత్యాసాన్ని సరి చేయలేకపోయాను. మా అమ్మానాన్నలు చనిపోయిన తర్వాత నేను ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు. కొన్ని రోజుల పాటు ఏడుస్తూనే ఉండిపోయాను’ అని మిల్కా సింగ్‌ స్వయంగా చెప్పుకున్నాడు. మ్యాన్యువల్‌గా లెక్కించిన టైమింగ్‌లను ముందుగా ఈ ఈవెంట్లో ఫలితాల సమయంలో ప్రకటించారు.

కానీ ఎలక్ట్రానిక్‌ స్కోరు బోర్డు ప్రకారం ఆ తర్వాత వాటిని సవరించారు. దీని ప్రకారం మిల్కా 400 మీటర్ల టైమింగ్‌ అధికారికంగా 45.73 సెకన్లుగా నమోదైంది. భారత్‌ తరఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శన కాగా... 1998లో పరమ్‌జీత్‌ సింగ్‌ 45.70 సెకన్లలో (జాతీయ చాంపియన్‌షిప్‌లో) రేసు పూర్తి చేయడంతో మిల్కా రికార్డు కనుమరుగైంది. అయితే ఇన్నేళ్ల ఒలింపిక్‌ చరిత్రలో భారత అథ్లెట్లు ఎవరూ దీనికి సమమైన ప్రదర్శనను ఇవ్వలేకపోయారు. ఒక్క పతకం గెలుచుకోలేకపోగా... మిల్కా తరహాలో కనీసం నాలుగో స్థానం వరకు కూడా వెళ్లలేకపోయారు. ఇది చాలు మిల్కా ఘనత ఏమిటో చెప్పడానికి. 

–సాక్షి క్రీడా విభాగం

>
మరిన్ని వార్తలు