భారత్‌కీ లక్ష్మి

25 Oct, 2019 11:50 IST|Sakshi

భారత్‌కీ లక్ష్మి.. మన భాగ్యనగర లక్ష్మి

ప్రతిభావంత మహిళలను సత్కరించుకుందాం   

దీపావళి సందర్భంగా అరుదైన గౌరవమిద్దాం  

పీవీ సింధుకు హ్యాష్‌ట్యాగ్‌తో ప్రధాని పిలుపు  

హైదరాబాద్‌ మహిళా క్రీడాకారులపై ప్రత్యేక కథనం

భారతదేశాన్ని కర్మభూమిగా పిలుస్తాం. మాతృగడ్డను తల్లితో పోలుస్తాం.మహిళను ఆదిపరా శక్తిగా ఆరాధిస్తాం. దేవతగా పూజిస్తాం. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందంటూ ఆనందిస్తాం. అలాంటి ఆడపిల్లను గౌరవించుకునే అరుదైన అవకాశం వచ్చింది. వివిధ వృత్తుల్లో భాగస్వాములైన అమ్మాయిలు దేశ నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. మామూలు ఉద్యోగాల నుంచి ‘మంగళ్‌యాన్‌’ ప్రయోగాల వరకు వారి పాత్ర అనన్యం. అబల నుంచి సబలగా మారి జాతికి దశ దిశ నిర్దేశించడంలో భాగస్వాములవుతున్న మహిళలను ఈ దీపావళికి భారతలక్ష్మి పేరుతో గౌరవించుకుందామన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశమంతా కదులుతోంది. వివిధ రంగాల్లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న మన ఇంటి మహాలక్ష్మినిసత్కరించుకోవాల్ని బాధ్యత ఎంతో ఉంది. ఈ క్రమంలో మన భాగ్యనగరలక్ష్మిలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, క్రికెటర్‌ మిథాలీరాజ్, టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, జిమ్నాస్ట్‌ అరుణాబుద్ధారెడ్డి, టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రాంజల, త్రోబాల్‌ క్రీడాకారిణి ఇందూజ గడ్డం... ఇలా పలువురు మహిళా క్రీడాకారులు తమ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తూ.. ప్రపంచ పటంలో భారత్‌ కీర్తిని నలు దిశలా చాటుతున్నారు. వీరి రికార్డ్స్, అచీవ్‌మెంట్స్‌ను గురిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో వారిని గౌరవించాలంటూ మోదీ పిలుపునిచ్చారు. కేవలం క్రీడారంగమే కాదు.. విద్య, వైద్యం వంటి రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న వారిని ఈ దీపావళి సందర్భంగా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందనేది ప్రధాని మోదీ ఆలోచన.

మిక్స్‌డ్‌.. ఉమన్‌కేటగిరీలో కెరటం  
గుత్తా జ్వాల. 1990లో బ్యాడ్మింటన్‌ ఆటలో అరంగ్రేటం చేసింది. మిక్స్‌డ్, ఉమెన్‌ కేటగిరీల బ్యాడ్మింటన్‌లో గుత్తా ఓ సరికొత్త కెరటం. 2009, 2011 సంవత్సరాల్లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, బ్రాంజ్‌ మెడల్స్‌ని సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒలింపిక్స్‌లో రెండు ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన మొదటి క్రీడాకారిణిగా రికార్డ్‌ నెలకొల్పింది.

బ్యాడ్మింటన్‌లో మేటి..  
పీవీ సింధు. బ్యాడ్మింటన్‌పై మక్కువతో అడుగుపెట్టిన ఈమె ఇంటర్నేషనల్‌ డెబ్యూ గేమ్‌ని 2009లో ఆడింది. నాటి నుంచి ఇప్పటికీ తన ఆటతో క్రీడాభిమానులను మెప్పిస్తోంది. ఇటీవల ప్రపంచ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించి తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుతం యావత్ప్రపంచమే సింధు జపం చేసేలా, తన ఆటకు ఫిదా అయ్యేలా మలుచుకోవడం ఆమెకు ఆమే సాటి.  

షీ ఈజ్‌ ఫస్ట్‌ వరల్డ్‌నంబర్‌వన్‌
సానియా మీర్జా.. పరిచయం అక్కర్లేని పేరు. టెన్నిస్‌ గేమ్‌లో ఈమె రారాణి. బ్యాట్‌ చేతపట్టి దిగితే యువత నుంచి వృద్ధుల వరకు కేరింతలు కొట్టాల్సిందే. ఎవరెన్ని కామెంట్స్‌ చేసినా.. తన ఆటతోనే సమాధానం చెప్పి ఫస్ట్‌ వరల్డ్‌నంబర్‌ వన్‌ ర్యాంకును సాధించింది ఈ హైదరాబాదీ. తన ఆటతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకొన్న ఘనత సానియా సొంతం. 

సింధుకు మోదీ పిలుపు
ఇటీవల ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో ‘భారత్‌కీ లక్ష్మి’ అంశంపై మాట్లాడారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సింధు, బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ దీపిక పదుకొనేలను గౌరవించుకుందాం.. అంటూ ఆయన చెప్పారు. ఇదే విషయంపై వారిద్దరూ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. దీనికి తాము సహకరిస్తున్నామని, మహిళకు గుర్తింపు ఉంటేనే దేశ నిర్మాణంలో భాగస్వామ్యం మరింత ఎక్కువగా, బాధ్యతగా ఉంటుందనడం విశేషం.

త్రోబాల్‌లో టాపర్‌.. 
త్రోబాల్‌ గేమ్‌ పెద్దగా ఆదరణ లేని గేమ్‌ ఇది. కానీ..సిటీకి చెందిన గడ్డం ఇందూజ ఇదే గేమ్‌ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపర్చింది. స్కూల్‌ గేమ్‌తో ప్రారంభించి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో  విజయదుందుభి మోగిస్తోంది. ఇప్పటి వరకు 8 అంతర్జాతీయ టోర్నమెంట్‌లను ఆడిన ఇందూజ 5 గోల్డ్‌ మెడల్స్‌ సాధించింది. కొన్నేళ్లుగా భారత్‌ జట్టు కెప్టెన్‌ బాధ్యతలు నిర్వహిస్తోంది.

టెన్నిస్‌ సింగిల్స్‌లో సూపర్‌.. 
ప్రాంజల యడ్లపల్లి. టెన్నిస్‌ ప్లేయర్‌. తన కెరీర్‌లో హైయెస్ట్‌ సింగిల్స్‌ ఆడిన సూపర్‌ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా సింగిల్స్‌ ర్యాంకింగ్‌లో 280, డబుల్స్‌లో 232 ర్యాంకులను సొంతం చేసుకున్న క్రీడాకారిణిగా సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది.  

మహిళా క్రికెట్‌లో సంచలనం..

మిథాలీరాజ్‌ దొరై. క్రికెట్‌ అనే ఆట కేవలం పురుష క్రికెటర్లకే పరిమితం అనే మాటలకు చెక్‌ పెట్టింది. తన సారథ్యంలో భారత జట్టును రెండు పర్యాయాలు ఫైనల్స్‌కి తీసికెళ్లిన ఘనత సొంతం చేసుకుంది. ఆమె ద్వారానే మహిళా క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం విశేషం. నేటితరం అమ్మాయిలు క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకోవడానికి ప్రధాన కారణం మిథాలీరాజ్‌ అంటే అతిశయోక్తి కాదేమో.

24 అంతర్జాతీయ టైటిల్స్‌ విజేత
సైనా నెహ్వాల్‌. బ్యాండ్మింటన్‌ సింగిల్స్‌లో ఈమె ఓ ప్రభంజనం. 2006లో అండర్‌– 19 నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో ఓ చరిత్రను సృష్టించింది. ఆ రంగంలో ఇప్పటి వరకు ఈమె 24 అంతర్జాతీయ టైటిల్స్‌ని సాధించి తిరుగులేని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా రాణించడంవిశేషం.

కన్నతండ్రి స్వప్నం సాకారం.. 
అరుణ బుద్ధారెడ్డి. ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌లో ఈ హైదరాబాదీ పెను ప్రభంజనం సృష్టించింది. తన తండ్రి చూపిన బాటలో నడుస్తూ.. ఆయన ఇచ్చిన భరోసాతో ముందుకెళుతూ.. 2018 వరల్డ్‌కప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. అందరి మనసులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. 

సెల్ఫీ దిగండి.. పోస్ట్‌ చేయండి
మీ ఇంట్లో కూడా ప్రతిభావంతమైన కూతురు, కోడలు ఉన్నారా? వారు ఏం రంగంలో రాణిస్తున్నారు, వారు సాధించిన ఘనతలు ఏంటి? వారికి తల్లిదండ్రులుగా మీరు ఇస్తున్న గౌరవం ఏంటి అనే విషయాలను పొందుపరుస్తూ..  సెల్ఫీ దిగండి. దాన్ని ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ‘భారత్‌కీ లక్ష్మి’ పేరుకు హ్యాష్‌ట్యాగ్‌ చేసి పోస్ట్‌ చేయండి. ఈ దీపావళి సందర్భంగా ఇటు నేరుగా.. అటు సోషల్‌ మీడియా ద్వారా మన ఇంటి లక్ష్మిలను మనం సత్కరించుకుందాం.. గౌరవించుకుందామంటున్నారు ప్రధాని మోదీ.

మరిన్ని వార్తలు