ఇంగ్లండ్ ‘రికార్డు’ విజయం

26 Jun, 2016 00:04 IST|Sakshi
ఇంగ్లండ్ ‘రికార్డు’ విజయం

హేల్స్, రాయ్ శతకాలు
శ్రీలంకతో రెండో వన్డే

 
బర్మింగ్‌హామ్:
  ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (110 బంతుల్లో 133 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), జేసన్ రాయ్ (95 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత శతకాలతో రెచ్చిపోయారు. దీంతో శుక్రవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డే టైగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 254 పరుగులు చేసింది.

తరంగ (49 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్), చండిమాల్ (86 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా మాథ్యూస్ (54 బంతుల్లో 44; 3 ఫోర్లు), పెరీరా (45 బంతుల్లో 37; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్లంకెట్, రషీద్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్ల సూపర్ బ్యాటింగ్‌తో 34.1 ఓవర్లలో 256 పరుగులు చేసి నెగ్గింది. దీంతో ఒక్క వికెట్ కోల్పోకుండా 250కిపైగా పరుగులు చేసి గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. గతేడాది జింబాబ్వేపై న్యూజిలాండ్ 236 పరుగులు చేసి నెగ్గింది. అలాగే ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గతం (2010)లో స్ట్రాస్, ట్రాట్ రెండో వికెట్‌కు 250 పరుగులు జోడించారు.

>
మరిన్ని వార్తలు