అబ్బాయిలు అదుర్స్

20 Feb, 2016 00:08 IST|Sakshi
అబ్బాయిలు అదుర్స్

సెమీస్‌లో భారత పురుషుల జట్టు
క్వార్టర్స్‌లో 3-2తో మలేసియాపై విజయం
కీలక మ్యాచ్‌లో నెగ్గిన ప్రణయ్
ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

 
సొంతగడ్డపై భారత ‘రాకెట్’ దూసుకుపోతోంది. అంచనాలకు మించి రాణిస్తూ ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో పటిష్ట చైనా జట్టుపై సాధించిన విజయం గాలివాటమేమీకాదని నిరూపిస్తూ క్వార్టర్స్‌లోనూ భారత ఆటగాళ్లు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. మాజీ చాంపియన్ మలేసియాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు.
  
సాక్షి, హైదరాబాద్: అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత పురుషుల జట్టు ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ పోటీల చరిత్రలో తొలిసారి సెమీఫైనల్ దశకు అర్హత సాధించి ‘ఔరా’ అనిపించింది. మాజీ చాంపియన్ మలేసియాతో శుక్రవారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-2 తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఇండోనేసియాతో భారత్ తలపడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా 3-0తో చైనాను చిత్తు చేయగా... జపాన్ 3-0తో చైనీస్ తైపీపై... ఇండోనేసియా 3-0తో హాంకాంగ్‌పై గెలిచాయి. రెండో సెమీఫైనల్లో కొరియాతో జపాన్ పోటీపడుతుంది.

 శ్రీకాంత్‌తో శుభారంభం
గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చైనాపై 3-2తో సంచలన విజయం సాధించిన ఉత్సాహంతో భారత్ క్వార్టర ఫైనల్ పోరును గెలుపుతో మొదలుపెట్టింది. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-15తో ప్రపంచ 38వ ర్యాంకర్ జుల్‌కిఫ్లి జుల్‌ఫాద్లిపై నెగ్గి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తొలి గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమంకాలేదు. అయితే రెండో గేమ్‌లో శ్రీకాంత్ కాస్త తడబడ్డాడు. ఒకదశలో శ్రీకాంత్ 10-13తో వెనుకంజలో నిలిచాడు. అయితే వెంటనే తేరుకున్న శ్రీకాంత్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 15-13తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తన ప్రత్యర్థికి కేవలం రెండు పాయింట్లు సమర్పించుకున్న శ్రీకాంత్ విజయాన్ని దక్కించుకున్నాడు. పురురుషుల డబుల్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి భారత్‌కు రెండో విజయాన్ని అందించాడు. సుమీత్-మనూ అత్రి ద్వయం 21-10, 20-22, 21-16తో జువాన్ షెన్ లో-కియాన్ మెంగ్ తాన్ జంటను ఓడించింది. దాంతో భారత్ ఆధిక్యం 2-0కు చేరింది.

జయరామ్ తడబాటు
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి భారత్ పోటీని ముగుస్తుందని ఆశించినా అలా జరగలేదు. ప్రపంచ 25వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 21-17, 12-21, 16-21తో ప్రపంచ 38వ ర్యాంకర్ ఇస్కందర్ జుల్కర్‌నైన్ జైనుద్దీన్ చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్ నెగ్గిన జయరామ్ ఆ తర్వాత పలు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఫలితంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. నాలుగో మ్యాచ్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ ద్వయం 14-21, 21-14, 12-21తో యెవ్ సిన్ ఒన్గ్-ఇ యి తెయి జంట చేతిలో ఓడిపోయింది. దాంతో స్కోరు 2-2తో సమమైంది.

 ఆదుకున్న ప్రణయ్
ఇక నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ అద్భుత ఆటతీరుతో భారత్‌ను గట్టెక్కించాడు. ఒత్తిడిని దరిచేరనీయకుండా నిగ్రహంతో ఆడిన ప్రణయ్ వరుస గేముల్లో 21-12, 22-20తో టెక్ జి సూపై గెలిచి భారత్‌కు 3-2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

 భారత మహిళల జట్టుకు నిరాశ
మరోవైపు భారత మహిళల జట్టు పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. పటిష్టమైన దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 0-3తో ఓడిపోయింది. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 13-21, 14-21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జీ హున్ సుంగ్ చేతిలో ఓడిపోగా... డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 15-21, 22-20, 13-21తో కింగ్ యున్ జంగ్-సెయుంగ్ చాన్ షిన్ జంట చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్‌లో పీసీ తులసి 14-21, 15-21తో ప్రపంచ 14వ ర్యాంకర్ యోన్ జు బే చేతిలో పరాజయం పాలవ్వడంతో భారత కథ ముగిసింది.

మరిన్ని వార్తలు