ఆదిదేవుడికి అద్దెనగలే దిక్కు | Sakshi
Sakshi News home page

ఆదిదేవుడికి అద్దెనగలే దిక్కు

Published Sat, Feb 20 2016 12:07 AM

rental nagale direction

పదేళ్లుగా లాకర్‌లోనే శివయ్య par ఆభరణాలుఙ- బ్రహ్మోత్సవాల్లోనూ అద్దె నగలతోనే అలంకరణ
అప్పగింతలు మరిచి.. వేడుక చూస్తున్న అధికారులు


ఆదిదేవుడికి అద్దెనగలే దిక్కయ్యాయి. వజ్రవైఢూర్యాలు, మరకత మణులు, కంఠాభరణాలు, పచ్చలు పొదిగిన కిరీటాలు కానుకగా అందాయి. కానీ వీటిని పదేళ్లుగా అలంకరించడంలేదు. బ్రహ్మోత్సవాలప్పుడూ ఉత్సవర్లకు అద్దెనగలనే అలంకరిస్తున్నారు. స్వర్ణకాంతుల మధ్య దేదీప్యమానంగా వెలుగొందాల్సిన స్వామి,అమ్మవార్లు గిల్డ్‌నగల తళుకుల్లో కళావిహీనంగా కనిపించడం భక్తుల మనస్సును కలచివేస్తోంది. సంబంధిత ఉన్నతాధికారుల బదిలీలప్పుడు నగల అప్పగింతలు జరగకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ బ్రహ్మోత్సవాల్లోనైనా లాకర్లో నగలు గరళకంఠుడికి అలంకరిస్తారో.. సదా మామూలేనని వదిలేస్తారో వేచిచూడాలి మరి.

తిరుపతి : శ్రీకాళహస్తీశ్వర స్వామికి, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి చక్రవర్తులు, రాజులు, జమీందార్లు, భక్తులు విశేష ఆభరణాలను కానుకగా సమర్పించారు. వజ్ర, వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, మేలిమి ముత్యాలు, పగడాలు, పచ్చరాళ్లతో తయారు చేయించారు. బంగారు బిల్వ పత్ర మాలలు, పాపటి బిల్లలు, స్వర్ణఖచిత విభూది రేఖలు, కంఠాభరణాలు, భుజకీర్తులు, రుద్రాక్షమాలలు అబ్బో.. చాలానే ఉన్నాయి. అయితే దేవస్థానం అధికారులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కూడా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వీటిని అలంకరించడంలేదు. అద్దె నగలతో మమ అనిపించడం విమర్శలకు తావిస్తోంది.

దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా ఏటా పదమూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. నెలకోసారి నందిసేవ, పున్నమి రోజుల్లో ఊంజల్ సేవ జరుగుతాయి. శివయ్య వైభవం చాటే నిమిత్తం అత్యంత విలువైన దివ్యాభరణాలు అలకరించి ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. స్వర్ణ కాంతులతో మెరిసిపోయే స్వామి, అమ్మవార్లను దర్శించి భక్తులు పులకించిపోతారు. అయితే ఇప్పుడు ఆ స్వర్ణకాంతులు కనుమరుగయ్యాయి.

అద్దెనగలతో సరి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి రూ.15 కోట్ల విలువైన 51 కిలోల బంగారు నగలు ఉన్నట్లు సమాచారం. వీటిని దేవస్థానం అధికారులు బ్యాంకు లాకర్లలో భద్రపరిచారు. దాదాపు పదేళ్ల క్రితం వరకు వార్షిక బ్రహోత్సవాలు, ముఖ్యమైన ఉత్సవాలప్పుడు వీటిని బ్యాంకు లాకర్ల నుంచి తెప్పించి ఉత్సవమూర్తులకు అలంకరించేవారు. ఉత్సవాలు అయ్యాక మళ్లీ బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తారు. అయితే ప్రస్తుతం ఆ ఆనవాయితీకి తెరపడింది. పదేళ్లుగా బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్లలోనే మగ్గుతున్నాయి. ఉత్సవాల సమయంలో మాత్రం అద్దె నగలను తెచ్చి అలంకరిస్తున్నారు. దీనికి అధికారులు భద్రత కారణాలను సాకుగా చూపుతున్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా లేని రోజుల్లోనే దివ్యాభరణాలు అలకరించి ఉత్సవమూర్తులను ఊరేగించే వారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో వందల మంది పోలీసులు శ్రీకాళహస్తిలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంటారు. ప్రత్యేక భద్రతా దళం ఉంటుంది. అలాంటి సమయంలో ఆభరణాల భద్రతకు ఢోకా ఉండదని అందరికీ తెలుసు.

అధికారుల నిర్లక్ష్యమే
ఆలయంలో పనిచేసే అధికారులు బదిలీ అయ్యే సమయంలో ప్రతి వస్తువును కొత్తగా బాధ్యతలు తీసుకునే అధికారికి అప్పగించాలి. ఇపుడు ఆలయంలో ఆ విధానం అమలు కావడం లేదు. 2007 నుంచి ఇప్పటివరకు ఏడుగురు కార్యనిర్వహణాధికారులు మారారు. కానీ ఏ ఒక్కరూ వీటి అప్పగింతల గురించి పట్టించుకోలేదు. ఇదేమని అడిగేవారు కరువయ్యారు..

లాకర్లలను తెరిపించే యత్నం చేస్తాం
ప్రస్తుతం బ్యాంకు లాకర్లు కోదండరామిరెడ్డి పేరుమీద ఉన్నాయి. ఆయనను పిలిపించి జేఈవో ఆనందకుమార్ సమక్షంలో బ్యాంకు లాకర్లు తెరిపిస్తాం. నగలు స్వాధీనం చేసుకుంటాం. వాటిని పరిశీలించాక ఉత్సవాల్లో ఏవి వాడాలో చర్చించి ఉత్సవమూర్తులకు par అలంకరిస్తాం.ఙ- భ్రమరాంబ, కార్యనిర్వహణాధికారి, శ్రీకాళహస్తీశ్వరాలయం

Advertisement
Advertisement