ఆసీస్ కెప్టెన్ అరుదైన ఘనత

26 Feb, 2017 16:42 IST|Sakshi
ఆసీస్ కెప్టెన్ అరుదైన ఘనత

దుబాయ్: టీమిండియాతో తొలి టెస్టులో ఘనవిజయం సాధించడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ నెంబర్ వన్ ర్యాంక్‌ను పదిలం చేసుకున్నాడు. స్మిత్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 939 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. డాన్ బ్రాడ్‌మన్ (961), లెన్ హటన్ (945), జాక్ హబ్స్ (942), రికీ పాంటింగ్ (942), పీటర్ మే (941) తర్వాత స్మిత్ అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించాడు. బ్యాటింగ్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, సంగక్కర తమ కెరీర్‌లో అత్యుత్తమంగా 938 రేటింగ్ పాయింట్లు సాధించగా, స్మిత్ తాజాగా వీరిని అధిగమించాడు.

ఆదివారం ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్మిత్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. పుణె మ్యాచ్‌లో గెలిచాక ఆసీస్ ఆటగాళ్ల ర్యాంకులు మెరుగుపడ్డాయి. రెన్‌షా ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. పుణె టెస్టులో 12 వికెట్లు తీసిన ఓకెఫీ బౌలర్ల జాబితాలో 33 స్థానాలు ముందుకెళ్లి 29 ర్యాంక్ దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజా వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ జాబితాలో భారత్ ఓపెనర్ లోకేష్ రాహుల్ 11 స్థానాలను మెరుగుపరుచుకుని 46వ ర్యాంక్ సాధించాడు.

మరిన్ని వార్తలు