‘టెక్నికల్‌గా సరైన బ్యాట్స్‌మన్‌ కాదు’

8 Aug, 2019 10:36 IST|Sakshi

మెల్‌బోర్న్‌: తన సమకాలీన టెస్టు క్రికెటర్ల పరంగా చూస్తే యావరేజ్‌లో అందరికంటే ముందున్న ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌పై ఆ దేశానికే చెందిన దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో స్మిత్‌ తనదైన ముద్ర వేసినా టెక్నికల్‌గా చూస్తే సరైన బ్యాట్స్‌మన్‌ కాదని పేర్కొన్నాడు. స్మిత్‌ టెక్నిక్‌ చాలా వీక్‌గా ఉంటుందని, కాకపోతే పిచ్‌ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆడటంలో సిద్ధహస్తుడని మెక్‌గ్రాత్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతని టెక్నిక్‌ బాగాలేకపోయినా కెరీర్‌ ముగిసే సమయానికి ఒక ప్రత్యేకమైన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాడన్నాడు.యాషెస్‌ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్మిత్‌ వరుసగా రెండు భారీ సెంచరీలు సాధించి ఆసీస్‌ ఘన విజయం సాధించడంలో సహకరించాడు.

దాంతో స్మిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తుండగా, మెక్‌గ్రాత్‌ మాత్రం తన అభిప్రాయాన్ని కాస్త భిన్నంగా స్పందించాడు. ‘ స్మిత​ కెరీర్‌ ముగిసే సమయానికి ఒక స్పెషల్‌ క్రికెటర్‌గా నిలుస్తాడు. అతని టెస్టు యావరేజ్‌ ప్రస్తుతం 60కి పైగా ఉంది. కాకపోతే సాంకేతికంగా చూస్తూ స్మిత్‌ ఆట తీరు సరైనది కాదు. మ్యాచ్‌ పరిస్థితుల్ని అర్ధం చేసుకునే ఆడే కొంతమంది క్రికెటర్లలో స్మిత్‌ కూడా ఒకడు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ పరంగా చూస్తే క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి స్మిత్‌ ఎక్కవ సమయం తీసుకుంటాడనేది వాస్తవం. దాంతోనే పలు ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌ల్ని స్మిత్‌ నమోదు చేస్తున్నాడు’ అని మెక్‌గ్రాత్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు