ఆసీస్‌కు షాక్‌.. స్మిత్‌ దూరం

20 Aug, 2019 16:51 IST|Sakshi

లీడ్స్‌ : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇం‍గ్లండ్‌తో జరగబోయే మూడో టెస్టుకు సన్నద్దమవుతున్న ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ గాయం కారణంగా మూడు టెస్టుకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ అస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.  గాయం నుంచి స్మిత్‌ పూర్తిగా కోలుకోకపోవడంతో మూడో టెస్టులో అతడు ఆడటం లేదని ట్వీట్‌ చేసింది. ఇక తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన స్మిత్‌.. తర్వాతి టెస్టు ఆడకపోవడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.   

లార్డ్స్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ గాయపడిన విషయం తెలిసిందే. గాయంతో విలవిల్లాడిన అతడు మైదానాన్ని వీడాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు కూడా దిగలేదు. అయితే మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. అయితే మంగళవారం ఉదయం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో స్మిత్‌ ఇబ్బంది పడ్డాడని, గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అతడికి విశ్రాంతినిస్తేనే మంచిదని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు తెలిపాడు. దీంతో స్మిత్‌ హెడింగ్లీ టెస్టు ఆడటం లేదని ప్రకటించింది. 

తొలి టెస్టులో రెండు సెంచరీలు సాధించి ఆసీస్‌ విజయంలో స్మిత్‌ కీలకపాత్ర పోషించాడు. లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ 92 పరుగులతో రాణించాడు. ఇక స్మిత్‌ దూరం కావడంతో రెండో టెస్టులో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబషేన్‌ తర్వాతి టెస్టు ఆడే అవకాశం ఉంది. ఇక ఇరుజట్ల మధ్య మూడో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా