ఇదేం సెలబ్రేషన్‌రా నాయనా..!

24 Sep, 2019 10:57 IST|Sakshi

బెంగళూరు: క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌ వికెట్‌ తీసిన తర్వాత బౌలర్ల రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో కాస్త భిన్నంగా బౌలర్లు సంబరాలు చేసుకుని వార్తల్లో నిలుచుపోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ది ఒక స్టయిల్‌ అయితే. వెస్టిండీస్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ది మరో ప్రత్యేకత. అయితే ఆదివారం బెంగళూరులో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో​ దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ షమ్సీ షూ తీసి సెలబ్రేట్‌ చేసుకోవడం మరింత భిన్నత్వాన్ని చూపించింది.  షమ్సీ ఈతరహాలో సంబరాలు చేసుకోవడం అభిమానుల్లో నవ్వులు పూయించింది.(ఇక్కడ చదవండి: ‘ప్రయోగాలు’ ఫలించలేదు!)

సఫారీలతో మూడో టీ20లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో భారత ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు ఆరంభించారు. ఇక్కడ రోహిత్‌ శర్మ(9) వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. అయితే ధావన్‌ మాత్రం మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రత్యేకంగా షమ్సీ వేసిన తన తొలి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్‌ షమ్సీ వేసిన ఎనిమిదో ఓవర్‌ రెండో బంతికి ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. ధావన్‌ను ఔట్‌ చేయడంతో షమ్సీ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.  తన సెలబ్రేషన్స్‌ షూ విప్పి మరీ చేసుకున్నాడు. తన షూను చెవి దగ్గర పెట్టుకుని ఫోన్‌ కాల్‌ మాట్లాడుతున్నట్లు ఫోజిచ్చాడు. దీనిపై మరో దక్షిణాఫ్రికా ఆటగాడు వాండర్‌ డస్సెన్‌ మ్యాచ్‌ తర్వాత మాట్లాడుతూ.. ‘ తన క్రికెట్‌ హీరో ఇమ్రాన్‌ తాహీర్‌కు ఫోన్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నాడని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదేం సెలబ్రేషన్స్‌ రా నాయన అనుకోవడం అభిమానుల వంతైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు