కేదార్‌  మహిమ

3 Mar, 2019 01:12 IST|Sakshi

237 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించడం అంటే భారత్‌లాంటి పటిష్టమైన జట్టుకు చిటికెలో పని. కానీ ఆసీస్‌పై విజయం అంత సులువుగా దక్కలేదు. ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక్కో బంతిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పట్టుదలతో పోరాడాల్సి వచ్చింది. ఒక దశలో పరుగులు చేయడంకంటే పరిస్థితికి అనుగుణంగా ఓపిగ్గా నిలబడాల్సి వచ్చింది. సరిగ్గా ఇలాంటి స్థితిలో కేదార్‌ జాదవ్, ధోని ద్వయం దానినే చేసి చూపించారు. టాప్‌–4 బ్యాట్స్‌మెన్‌ వెనుదిరిగిన తర్వాత వీరిద్దరు తమ విలువను చాటారు. ఐదో వికెట్‌కు అభేద్యంగా 141 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ముఖ్యంగా అసలైన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆటను చూపిస్తూ ఈ స్థానాలపై వస్తున్న సందేహాలను పటాపంచలు చేశారు. అంతకుముందు పేసర్‌ షమీతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, జడేజా బౌలింగ్‌ ముందు ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. స్వల్ప స్కోర్ల మ్యాచే అయినా... మొత్తంగా చూస్తే ఆసక్తికరంగా, పోటాపోటీగా సాగిన పోరులో గెలిచి భారత్‌ శుభారంభం చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో మొదలు పెట్టింది. శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖాజా (76 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేశాడు. మ్యాక్స్‌వెల్‌ (51 బంతుల్లో 40; 5 ఫోర్లు), స్టొయినిస్‌ (53 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అనంతరం భారత్‌ 48.2 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేదార్‌ జాదవ్‌ (87 బంతుల్లో 81 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఎమ్మెస్‌ ధోని (72 బంతుల్లో 59 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్‌ కోహ్లి (45 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్‌ శర్మ (66 బంతుల్లో 37; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం నాగపూర్‌లో జరుగుతుంది.  

రాణించిన కోహ్లి... 
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. రోహిత్‌ కొట్టిన ఫోర్‌తో ఇన్నింగ్స్‌ ప్రారంభమైనా... ధావన్‌ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఈ దశలో రోహిత్, కోహ్లి కలిసి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. వేగంగా పరుగులు సాధించకపోయినా, వీరిద్దరు జాగ్రత్తగా ఆడారు. ఆసీస్‌ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. తన తొలి 9 బంతుల్లో ఒకే సింగిల్‌ తీసిన కోహ్లి కూల్టర్‌ నీల్‌ ఓవర్లో రెండు ఫోర్లతో జోరు పెంచే ప్రయత్నం చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ 42 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా భారత్‌ను దెబ్బ తీశాడు. తన మూడో ఓవర్లో అతను కోహ్లిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూలో ఆసీస్‌ ఫలితం సాధించింది. కొద్ది సేపటి తర్వాత రాయుడు (13)ని కూడా అతను ఔట్‌ చేశాడు. ఈ రెండు వికెట్ల మధ్య కూల్టర్‌ నీల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్‌ క్యాచ్‌ ఇచ్చాడు.  

కీలక భాగస్వామ్యం.. 
భారత్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారిన దశలో మళ్లీ గెలుపుపై ఆశలు పెంచింది ధోని, జాదవ్‌ ల భాగస్వామ్యమే. రాన్రానూ కఠినంగా మారుతున్న పిచ్‌పై వీరిద్దరు ఆరంభంలో చాలా జాగ్రత్తగా ఆడారు. అప్పుడప్పుడు అవకాశాన్ని బట్టి బౌండరీ కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వీరిద్దరు ఆడగా... 24వ ఓవర్లో జత కట్టిన ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్‌ అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఒకదశలో 46 బంతుల్లో 29 పరుగులే చేసిన ధోని... కూల్టర్‌ నీల్‌ ఓవర్లో సిక్స్, ఫోర్‌ బాదడంతో ఊపు వచ్చింది. ఇదే ఓవర్లో ధోని షాట్‌ను స్టొయినిస్‌ క్యాచ్‌ పట్టడంలో విఫల ప్రయత్నం చేశాడు. ఆసీస్‌ ఔట్‌ కోసం అప్పీల్‌ చేసినా, రీప్లేలో బంతి నేలకు తాకిందని తేలింది. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన జాదవ్‌ ముందుగా 67 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 68 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్న ధోని... 49వ ఓవర్లో తొలి రెండు బంతులను మెరుపు వేగంతో ఫోర్లుగా మలిచి మ్యాచ్‌ను ముగించాడు.  

తడబడుతూ... 
భారత పేస్, స్పిన్‌ బౌలర్లు సమష్టిగా చెలరేగి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. పడుతూ లేస్తూ సాగిన ఆ జట్టుకు రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించాయి. రెండో వికెట్‌కు ఖాజా, స్టొయినిస్‌ 87 పరుగులు జోడించగా...ఏడో వికెట్‌కు క్యారీ, కూల్టర్‌ నీల్‌ 62 పరుగులు జత చేశారు. షమీ వేసిన మెయిడిన్‌ ఓవర్‌తో కంగారూల ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. తర్వాతి ఓవర్లోనే కెప్టెన్‌ ఫించ్‌ (0)ను ఔట్‌ చేసి బుమ్రా దెబ్బ కొట్టాడు. వరుసగా విఫలమవుతున్న ఆసీస్‌ కెప్టెన్‌ తన 100వ వన్డేలో కూడా డకౌట్‌గానే వెనుదిరిగాడు. ఈ స్థితిలో ఖాజా, స్టొయినిస్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే షమీ, బుమ్రా రెండు వైపుల నుంచి కట్టి పడేయడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. 

ధోని బ్యాట్‌ లోగో మారింది...
చాలా కాలం తర్వాత ధోని తన బ్యాట్‌పై కొత్త లోగోతో బరిలోకి దిగాడు. తొలి వన్డేలో అతను ఎస్‌ఎస్‌ (సన్‌రిడ్జెస్‌ బ్యాట్స్‌) స్టికర్‌తో ఆడాడు. ఇటీవలి వరకు అతనికి ఆస్ట్రేలియా కంపెనీ స్పార్టన్‌తో ఒప్పందం ఉండేది. అయితే అనూహ్యంగా మూతపడ్డ ఆ సంస్థ ధోని, గేల్, మోర్గాన్‌వంటి తదితర క్రికెటర్లకు భారీ మొత్తంలో డబ్బులు ఎగ్గొట్టింది. 2013 డిసెంబర్‌లో స్పార్టన్‌తో ధోని కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం అతనికి ఏడాదికి రూ. 20 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పటి దాకా మొత్తం అన్నీ కలిపి స్పార్టన్‌ నాలుగు విడతలుగా కేవలం రూ. 20 కోట్లు మాత్రమే ఇచ్చింది. దాంతో బెంగళూరులో జరిగిన రెండో టి20లో స్పార్టన్‌ బ్యాట్‌ను ఆఖరిసారిగా వాడిన అనంతరం ధోని దానికి మంగళం పలికాడు. స్పార్టన్‌కు ముందు సుదీర్ఘ కాలం పాటు ధోని రీబాక్‌ లోగో బ్యాట్‌లు వాడాడు.   

మహి భాయ్‌ తోడుంటే... 
ఇటీవల ఆస్ట్రేలియాలో ఈ తరహాలోనే ఛేదించాం. అయినా, అవతలి ఎండ్‌లో మహి భాయ్‌ (ధోని) ఉంటే మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. మిడిలార్డర్‌లో ఎలా ఆడాలో అతడి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఈ విషయంలో ధోనిని మించినవారు లేరు. ఒక్కో మ్యాచ్‌పై మేం దృష్టిపెడుతున్నాం. మైదానంలో తీవ్రతతో ఎలా ఆడాలో మా కెప్టెన్‌ను చూసి తెలుసుకుంటున్నాం. బౌలింగ్‌ చేసేటప్పుడు నేను బౌలర్‌గా కాకుండా... వికెట్‌కు సూటిగా బంతులేస్తూ బ్యాట్స్‌మన్‌ ఏం చేయబోతున్నాడో ఆలోచిస్తా.    
– కేదార్‌ జాదవ్‌  

బౌలర్ల కారణంగానే గెలిచాం 
బంతితో మేం బాగానే రాణించాం. ప్రత్యర్థిని కట్టిపడేస్తూ సాగిన జడేజా స్పెల్‌ ప్రశంసనీయం. ఫీల్డింగ్‌లోనూ అతడు జట్టుకు ఆస్తిలాంటివాడు. తెల్ల బంతితో షమీ ఇంత బాగా బౌలింగ్‌ చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు. మ్యాక్స్‌వెల్‌ను ఔట్‌ చేసిన తీరు ముచ్చట గొలిపింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పిచ్‌పై బ్యాటింగ్‌ కష్టంగా మారింది. ధోని, జాదవ్‌ బాధ్యత తీసుకుని నెలకొల్పిన భాగస్వామ్యం అద్భుతం. –విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌  

>
మరిన్ని వార్తలు