మరో విజయంపై భారత్ దృష్టి

26 Jul, 2013 07:07 IST|Sakshi
మరో విజయంపై భారత్ దృష్టి

హరారే: రెండు నెలల పాటు తీరిక లేకుండా ఆడుతున్నందుకు జింబాబ్వే పర్యటనలో కాస్త సేదతీరి ఆడతామని సిరీస్ ప్రారంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పాడు. అన్నట్టుగానే యువకులతో కూడిన భారత క్రికెట్ జట్టు తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ఇదే ఊపును నేడు (శుక్రవారం) జరిగే ‘సెల్‌కాన్ కప్’ సిరీస్‌లోని రెండో వన్డేలోనూ కొనసాగించాలని భావిస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో అంతా భారత్‌కు అనుకూలంగానే జరిగిందని చెప్పలేం. రవీంద్ర జడేజా, ఉనాద్కట్ మినహా మిగతా వారిని జింబాబ్వే బ్యాట్స్‌మెన్ దీటుగానే ఎదుర్కొన్నారు.
 
 ఆలౌట్ కాకపోవడంతో పాటు నిర్ణీత 50 ఓవర్లపాటు క్రీజులో ఉండగలిగారు. ముఖ్యంగా ఓపెనర్ సికందర్ రజా దాదాపుగా సెంచరీకి చేరువలో వచ్చాడు. చివర్లో ఎల్టన్ చిగుంబురా 34 బంతుల్లోనే 43 పరుగులు చేసి భారత్‌కు హెచ్చరికలు పంపాడు. పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న వినయ్ కుమార్ ఓవర్‌కు ఆరు పరుగులను మించి ఇచ్చాడు. ఈ లోటుపాట్లను సరిచేసుకుని పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాలతో బరిలోకి దిగేందుకు కోహ్లి సేన ఎదురుచూస్తోంది. అటు తమ బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పటిష్టపరుచుకుని భారత్‌కు గట్టిపోటీనివ్వాలనే ఆలోచనలో జింబాబ్వే జట్టు ఉంది.
 
 శుభారంభం అందాలి
 భారత జట్టు ఫామ్ గురించి ఆందోళన అనవసరం. అన్ని విభాగాల్లో తమదైన ముద్ర వేస్తూ ఆటగాళ్లు సత్తా చూపించుకుంటున్నారు. అయితే ఇటీవలి మ్యాచ్‌ల్లో జట్టుకు శుభారంభం అందడం లేదు. భారత్ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మధ్య నెలకొన్న భాగస్వామ్యాలు 26, 23, 27 మాత్రమే. అలాగే వ్యక్తిగతంగానూ ఈ జోడి భారీ స్కోర్లు సాధించాల్సిన అవసరం ఉంది. ఇక మిడిలార్డర్‌లో కెప్టెన్ కోహ్లి సూపర్ ఫామ్‌తో దూసుకెళుతున్నాడు. జట్టులో తొలిసారిగా చోటు దక్కించుకున్న అంబటి రాయుడు తన స్థాయికి తగ్గట్టు ఆడి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అపార అనుభవమున్న ఈ తెలుగు తేజం జింబాబ్వే బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఇదే ఆత్మవిశ్వాసంతో మిగిలిన మ్యాచ్‌లు ఆడగలిగితే రాయుడికి మంచి భవిష్యత్తు ఉందనడంలో సందేహం లేదు. బౌలింగ్ విభాగంలో జడేజా తప్ప అందరూ వికెట్ పడగొట్టారు. ఇక నేటి మ్యాచ్‌లో జట్టులో మార్పులు చేస్తారా? లేక పుజారా, రసూల్ ప్రతిభను కూడా పరిశీలించే ఆలోచనలో ఉన్నారా? అనేది వేచి చూడాల్సి ఉంది.
 
 పోటీ ఇస్తారా?
 తొలి మ్యాచ్‌లో మరీ పేలవ ప్రదర్శన కాకుండా 200 పరుగులకు పైగా సాధించిన జింబాబ్వే మరింత మెరుగ్గా ఆడాలని భావిస్తోంది. సికందర్, చిగుంబురా చూపించిన తెగువ, ఓపికను మిగతా ఆటగాళ్లు కూడా చూపితే 250 దాకా స్కోరును సాధించి భారత్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సిబందా, మసకద్జా, బ్రెండన్ టేలర్ తమ స్థాయి ఆటతీరును చూపాల్సి ఉంది. అయితే బౌలింగ్ విభాగం మాత్రం పటిష్ట భారత లైనప్‌ను కట్టడి చేయడం తలకు మించిన భారమే.
 
 ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న కోహ్లి జోరును అడ్డుకునేందుకు వారు చెమటోడ్చాల్సిందే. ధావన్ మెరుపులు కూడా తోడైతే వీరికి కష్టకాలమే. ఉత్సేయ మాత్రమే తన పది ఓవర్లలో రెండు వికెట్లు తీయగలిగాడు. సొంత మైదానంలో ఆడే వెసులుబాటు ఉండడంతో ఇక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని బోణీ చేయాలని టేలర్ సేన పట్టుదలతో ఉంది.
 
 జట్లు: (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రైనా, జడేజా, రాయుడు, కార్తీక్, మిశ్రా, షమీ, వినయ్, ఉనాద్కట్.
 
 జింబాబ్వే: టేలర్ (కెప్టెన్), సిబందా, సికందర్, విలియమ్స్, మసకద్జా, వాలర్, చిగుంబురా, ముటోమ్‌బోడ్జి, ఉత్సేయ.
 

మరిన్ని వార్తలు