మంజ్రేకర్‌పై టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌

6 Feb, 2018 09:36 IST|Sakshi
సంజయ్‌ మంజ్రేకర్‌ (పాత చిత్రం)

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్‌ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్ పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2017 గానూ పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు ఆయన ఓటు వేయటంతో అసలు వ్యవహారం మొదలైంది. 

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో 2017 సంవత్సరానికి గానూ ఉత్తమ కెప్టెన్‌ అవార్డులకు నామినీలను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సౌతాఫ్రికా, పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌ కెప్టెన్లు స్టీవ్‌ స్మిత్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, అస్గర్‌ స్టానిక్‌జై, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, ఇంగ్లాండ్‌ మహిళా జట్టు కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ పేర్లను ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన మంజ్రేకర్‌ తాను మాత్రం సర్ఫరాజ్‌ అహ్మద్‌కే ఓటేస్తానని చెప్పాడు. 

మంజ్రేకర్‌ అభిప్రాయం ఏంటంటే... ‘‘కష్టకాలంలో సర్ఫరాజ్‌ కెప్టెన్సీ పాకిస్థాన్‌కు ఎంతో తోడ్పాటు అందించింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై తడబడే పాక్‌ జట్టును కెప్టెన్‌గా విజయతీరాలకు చేర్చాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ టోర్నీని తన దేశానికి అందించటం.. ఎక్కువ మ్యాచ్‌లను గెలిపించిన ట్రాక్‌ రికార్డు ఉంది.(మొత్తం 13 వన్డే మ్యాచ్‌..11 గెలుపు, 2-ఓటమి.. టీ20మ్యాచ్‌లు 10..  8-గెలుపు, 2-ఓటమి). మిగతా వారికంటే సర్ఫరాజ్‌ కష్టం ఎక్కువ కనిపిస్తోంది. అందుకే అండర్‌ డాగ్‌ జట్టయిన పాక్‌ సారథికే నా ఓటు’’ అని తెలిపాడు.

అంతే... కోహ్లిని కూడా కాదని, దాయాది జట్టు కెప్టెన్‌ కు ఓటేయటంపై మంజ్రేకర్‌ పై మండిపడుతున్నారు. ‘ఆటగాడిగా, విశ్లేషకుడిగా ఫేలయిన నువ్వు ఇప్పుడు దేశభక్తుడిగా కూడా విఫలమయ్యావ్‌’ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు కోహ్లి, సర‍్ఫరాజ్‌ ఓవరాల్‌ ప్రదర్శనలను పోలుస్తూ కోహ్లి గ్రేట్‌.. మంజ్రేకర్‌ వేస్ట్‌ అంటూ సందేశాలు పెడుతున్నారు. మరోవైపు మంజ్రేకర్‌ అభిప్రాయంపై పాక్‌లోనూ వ్యతిరకత వ్యక్తమవుతోంది. పాక్‌ను అండర్‌ డాగ్‌ గా పొల్చటంపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూడు ఐసీసీ టోర్నమెంట్‌లను జేజిక్కిచ్చుకున్న పాక్‌ను మంజ్రేకర్‌ తక్కువ చేసి మాట్లాడాల్సింది కాదని అంటున్నారు. ఏది ఏమైనా మంజ్రేకర్‌ తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పటంలో తప్పేం లేదన్న కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు