డీఆర్‌ఎస్ దిశగా భారత్!

15 Oct, 2016 00:00 IST|Sakshi
డీఆర్‌ఎస్ దిశగా భారత్!

టెక్నాలజీపై చర్చించనున్న బీసీసీఐ


న్యూఢిల్లీ: ఎనిమిదేళ్లుగా అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని వ్యతిరేకిస్తూ వచ్చిన భారత్, ఇప్పుడు కాస్త పట్టువిడుపులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఈ విషయంలో మరికాస్త చొరవ ప్రదర్శిస్తే త్వరలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో డీఆర్‌ఎస్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీపై మరింత స్పష్టత ఇచ్చి, దాని పనితీరును వివరించేందుకు ఐసీసీ జీఎం జెఫ్ అలార్డిస్ తదితరులు బీసీసీఐ పెద్దలు, కోచ్ అనిల్ కుంబ్లేతో సమావేశం కానున్నారు. వచ్చే వారమే దీనిపై చర్చిస్తామని ఐసీసీ ప్రకటించింది. బాల్ ట్రాకింగ్, హాక్ ఐ టెక్నాలజీకి సంబంధించి భారత్‌కు ఉన్న సందేహాలను వారు నివృత్తి చేస్తారు.

డీఆర్‌ఎస్ వంద శాతం కచ్చితత్వంతో ఉంటేనే దానికి అంగీకరిస్తామంటూ బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, నాటి టెస్టు కెప్టెన్ ధోని గట్టిగా వాదించారు. అరుుతే కోహ్లి కెప్టెన్ అయ్యాక బోర్డు ఆలోచనలోనూ మార్పు కనిపించింది. ఐదు టెస్టుల భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లో చిన్నపాటి అంపైరింగ్ పొరపాట్లు కూడా ఫలితాన్ని మార్చే అవకాశం ఉండటంతో డీఆర్‌ఎస్ అమలుపై బోర్డు ముందుకు వస్తోంది. 2008లో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భారత్ ఒకే ఒకసారి డీఆర్‌ఎస్ వాడగా... ఎక్కవ భాగం నిర్ణయాలు మన జట్టుకు ప్రతికూలంగా వచ్చారుు. దాంతో ఏ సిరీస్‌లోనూ దానిని వాడేందుకు బీసీసీఐ అంగీకరించలేదు.

మరిన్ని వార్తలు