రాజా రిత్విక్‌కు తొలి జీఎం నార్మ్‌

13 Dec, 2019 10:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ చెస్‌ క్రీడాకారుడు, ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) రాజా రిత్విక్‌ తన ప్రొఫెషనల్‌ కెరీర్‌లో మరో ముందడుగు వేశాడు. గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా సాధించే దిశగా 15 ఏళ్ల రాజా రిత్విక్‌ సాగుతున్నాడు. స్పెయిన్‌ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఎలోబ్రెగట్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో మెరుగ్గా రాణించిన రాజా రిత్విక్‌ తొలి జీఎం నార్మ్‌ను అందుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో నిర్ణీత తొమ్మిది రౌండ్ల అనంతరం మూడు విజయాలు, ఆరు ‘డ్రా’లు నమోదు చేసి 6 పాయింట్లతో అతను 16వ స్థానాన్ని దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా తనకన్నా ఎంతో మెరుగైన క్రీడాకారులతో తలపడిన రిత్విక్‌ అజేయంగా నిలిచి 26 రేటింగ్‌ పాయింట్లను సాధించాడు.

దీంతో అతని ఖాతాలో ప్రస్తుతం 2407 రేటింగ్‌ పాయింట్లతో పాటు తొలి జీఎం నార్మ్‌ వచ్చి చేరింది. ఇందులో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లతో ఆడిన రిత్విక్‌ ఒకరిని ఓడించి మరో ఐదుగురితో తన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. తొలి గేమ్‌లో కొరిజే లిలీ (జార్జియా)పై, రెండో గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్‌ నర్సిసో డుబ్లాన్‌ మార్క్‌ (స్పెయిన్‌)పై, నాలుగో గేమ్‌లో ఐఎం సోసా టోమస్‌ (అర్జెంటీనా)పై గెలుపొందిన రిత్విక్‌... జీఎం అరిజ్‌మెండి మార్టినెజ్‌ జులెన్‌ లూయిస్‌ (స్పెయిన్‌; మూడో గేమ్‌), జీఎం అలొన్సో రోసెల్‌ అల్వర్‌ (స్పెయిన్‌; ఐదో గేమ్‌), ఐఎం జనన్‌ ఎవినీ (స్పెయిన్‌; ఆరో గేమ్‌), జీఎం కార్తీక్‌ వెంకటరామన్‌ (భారత్‌; ఏడో గేమ్‌), జీఎం గుకేశ్‌ (భారత్‌; ఎనిమిదో గేమ్‌), ఏంజెలిస్‌ సాల్వడర్‌ (స్పెయిన్‌; తొమ్మిదో గేమ్‌)లతో ‘డ్రా’ చేసుకున్నాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా