టెస్టు చాంపియన్‌షిప్‌కు నో!

14 Mar, 2017 23:54 IST|Sakshi
టెస్టు చాంపియన్‌షిప్‌కు నో!

ఐసీసీ ప్రతిపాదనను తిరస్కరించిన భారత్‌
సమావేశానికి హాజరు కాబోమని స్పష్టీకరణ   


ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మధ్య కొనసాగుతున్న దూరం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభ్య దేశాలకు ఐసీసీ నిధులు పంచే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ కొన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్న భారత బోర్డు... తాజాగా టెస్టు చాంపియన్‌షిప్‌ నిర్వహణ విషయంలో తమ అసంతృప్తిని బయటపెట్టింది. 2019లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ నిర్వహించే విషయంలో చర్చించేందుకు రమ్మంటూ ఐసీసీ ఇచ్చిన ఆహ్వానాన్ని బీసీసీఐ తిరస్కరించింది.

ఐసీసీ ప్రతిపాదన ప్రకారం మొత్తం జట్లను రెండు గ్రూప్‌లుగా (9 ప్లస్‌ 3) విభజించి నాలుగేళ్ల వ్యవధిలో టెస్టు చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. గతంలో 2013, 2017లో కూడా వీటి నిర్వహణ గురించి ప్రయత్నాలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. తాజా పరిణామంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీసీసీఐ, రానున్న టెస్టు క్యాలెండర్‌లో ఎలాంటి మార్పులకు అంగీకరించేది లేదని చెప్పేసింది. ‘అసలు 9 ప్లస్‌ 3 జట్ల ప్రతిపాదన అనేదే అర్థరహితం. ఐర్లాండ్, అప్ఘనిస్థాన్‌ జట్లకు ఇంకా పూర్తి స్థాయి సభ్యత్వం కూడా ఇవ్వకుండానే ఆ జట్లను ఎలా చేరుస్తారు. దీనిపై మా ఆలోచనలు ఎలా ఉన్నాయో పరీక్షించాలని ఐసీసీ బోర్డు సభ్యులు ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. బహుశా వారికి బలహీనంగా కనిపిస్తున్న బీసీసీఐ ఏమీ చేయలేదు అని భావిస్తున్నట్లున్నారు’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఐసీసీ రెండు రోజుల వర్క్‌షాప్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ కొట్టిపారేసిన బోర్డు... మున్ముందు కీలకాంశాల్లో ఓటింగ్‌ ద్వారా మద్దతు కూడగట్టగలమని విశ్వాసంతో ఉంది. ఏప్రిల్‌లో జరిగే ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో భారత బోర్డు తగిన వ్యూహంతో ముందుకు వెళ్లవచ్చు. ‘మేం ఏం చేయబోతున్నామనేది ఇప్పుడే చెప్పడం సరైంది కాదు. సమయం వచ్చినప్పుడు తగిన విధంగా స్పం దిస్తాం. ఏం జరుగుతుందో అప్పుడే చూడండి’ అంటూ బీసీసీఐ ప్రతినిధి అన్నారు. 

మరిన్ని వార్తలు