క్లార్క్‌కు వచ్చిన నష్టం ఏంటో ?

11 Mar, 2020 09:36 IST|Sakshi

ఆక్లాండ్‌ : ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరగనున్న చాపెల్- హాడ్లీ ట్రోఫీని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్‌ క్లార్క్‌  టోకెన్ గేమ్స్‌గా అభివర్ణించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తీరిక లేకుండా షెడ్యూల్ ఉండడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'తీరికలేని షెడ్యూల్‌తో వరుసగా జరుగుతున్న మ్యాచ్‌లను ఎవరు చూస్తారు. ఈ సిరీస్‌ ద్వారా జరిగే మ్యాచ్‌లు ఒక టోకెన్ గేమ్స్  లాంటివి. నేను క్రికెట్ అభిమానినే. కానీ వన్డే సిరీస్‌లు జరపడానికి ఇది అనువైన సీజన్ కాదు. మహిళల ప్రపంచకప్ గెలుపుతో క్రికెట్ సీజన్ ముగిసింది. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు జరిగాయి. మాకు ఇన్ని మ్యాచ్‌లు అవసరం లేదు'అని క్లార్క్ పేర్కొన్నాడు. (మైకేల్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు)

అయితే న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బోల్ట్ మైకేల్‌ క్లార్క్‌ కు తనదైన శైలిలో స్పందించాడు.'రసవత్తకరమైన సిరీస్ అతనికి టోకెన్ గేమ్స్‌గా ఎందుకు అనిపించిందో అర్థం కావడం లేదన్నాడు. అతని సమస్య ఏంటో నాకు తెలియదు. ఈ సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ కూడా జరిగే అవకాశం ఉండటంతో ప్రేక్షకులకు కావాల్సిన మజా లభిస్తుందన్నాడు. క్రికెట్ ఆడటానికి ఆస్ట్రేలియా అద్భుతమైన ప్రదేశం. న్యూజిలాండ్ కన్నా అక్కడి మైదానాలు పెద్దవి. ఈ సిరీస్ మ్యాచ్‌లకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరవుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్‌‌తో ఈ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. కొంతమంది మాట్లాడే మాటల్లో అర్థమే లేదు ' అని చెప్పుకొచ్చాడు. గెలుపే లక్ష్యంగా తాము ఈ సిరీస్‌లో బరిలోకి దిగనున్నట్లు బౌల్ట్‌ పేర్కొన్నాడు.(కోహ్లి, రోహిత్‌లు కాదు..  రాహులే గ్రేట్‌!)

కాగా వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డే‌ల్లో ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి.ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సిరీస్‌లు ఆడింది. భారత్‌తో 1-2, సౌతాఫ్రికాతో 0-3తో వన్డే సిరీస్‌లు కోల్పోయింది. అంతకు ముందు సౌతాఫ్రికాపైనే 2-1తో టీ20 సిరీస్ గెలిచింది. మార్చి 7నే సౌతాఫ్రికా పర్యటనను ముగించుకున్న ఆసీస్.. 5 రోజుల గ్యాప్‌తోనే 13 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్దమైంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు